
తెరుచుకున్న భగత్ గది
న్యూఢిల్లీ: బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించిన విప్లవయోధుడు భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీ వర్సిటీలో అప్పట్లో ఆయన్ను నిర్బంధించిన గదిలోకి బుధవారం విద్యార్థులను అనుమతించారు. వైస్ రీగల్ లాడ్జ్ ఎస్టేట్‌గా పిలిచే ఆ భవంతిలోని ఓ గదిలో 1931లో భగత్‌సింగ్‌ను ఒకరోజుపాటు బ్రిటిష్‌ప్రభుత్వం నిర్బంధించింది. అనంతరం ఇప్పటి పాక్‌లో ఉన్న లాహోర్ జైలులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను మార్చి 23న ఉరితీశారు.
1933లో ఎస్టేట్‌ను ఢిల్లీవర్సిటీకి అప్పగించగా అనంతరకాలంలో దీనిని వైస్‌చాన్స్‌లర్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఐదు స్కూళ్లకు చెందిన మొత్తం 100 మంది విద్యార్థులను గదిలోకి అనుమతించారు. భగత్‌సింగ్ స్వయంగా రాసిన ఉత్తరాలను గదిలో ప్రదర్శనకు ఉంచారు. ఆ గదిని ప్రజల సందర్శనార్ధం తెరిచే ఉద్దేశంలేదని వర్సిటీ వీసీ యోగేశ్ త్యాగి స్పష్టంచేశారు. పోరాటంచేసే ప్రతి ఒక్కరూ భగత్‌సింగ్ నుంచి స్పూర్తిపొందుతారన్నారు.