న్యూఢిల్లీ: భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు నష్టపరిహారం పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఈనెల 10 నుంచి ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద తమ మద్దతుదారులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఐదుగురు మహిళా బాధితులు శనివారం తమ ఆందోళన విరమించారు. బాధితులకు అదనంగా మరో రూ.లక్ష పరిహారం ఇవ్వాలని, సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన పిటిషన్‌లో భోపాల్ మృతుల సంఖ్యను, క్షతగాత్రులను సంఖ్యను సరిచేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
శుక్రవారం ఎరువుల మంత్రి అనంత్‌కుమార్ జంతర్‌మంతర్ వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించడంతో బాధితులు దీక్ష విరమించారు. ‘‘మా డిమాండ్లకు మంత్రి అంగీకరించారు. వైద్య పరిశోధనలు, ఆసుపత్రుల రికార్డుల ప్రకారం మృతుల సంఖ్యను నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చే సింది’ అని భోపాల్ గ్యాస్ పీడిత మహిళా స్టేషనరీ కర్మచారి సంఘ్ అధ్యక్షురాలు రషీదా బీ చెప్పారు. గ్యాస్ మృతుల సంఖ్యలో ఆసుపత్రి రికార్డులనే పరిగణనలో తీసుకుంటామని, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌లో కూడా ఆ వివరాలనే నమోదు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు.