అబ్బాయి నల్లగా ఉన్నాడు.. నాకీ పెళ్లొద్దు!
మరి కొద్ది సేపట్లో పెళ్లి ఉందనగా.. బిహార్‌లోని బక్సర్ జిల్లాలో ఓ యువతి తనకు చూపించిన పెళ్లికొడుకు నల్లగా ఉన్నాడని, తనకు సరిపోయేంత అందంగా లేడని చెప్పి పెళ్లికి నిరాకరించింది. తనకు భార్య అవుతుందనుకున్న అమ్మాయి తన రంగు చూసి తనను నిరాకరించిన విషయం తెలిసి పెళ్లికొడుకు షాకయ్యాడు. ఈ ఘటన పట్నాకు 125 కిలోమీటర్ల దూరంలోని రామ్ రేకా నగరంలో గల ఓ కళ్యాణమండపంలో జరిగింది. ఎలాగోలా పెళ్లికూతురుతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాలని తన తరఫు బంధువులను, కుటుంబ సభ్యులను ప్రాధేయపడ్డాడు. ఇది సమాజంలో తన గౌరవానికి సంబంధించిన విషయమని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నల్లటి అబ్బాయిని పెళ్లి చేసుకునేది లేదని స్పష్టం చేసిందని జిల్లా పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
నిజానికి పెళ్లి తంతు జరిగే క్రమంలో మొదట్లో ఆ అమ్మాయి సంతోషంగానే కనిపించింది. కానీ, ఉన్నట్టుండి తన కుటుంబ సభ్యులను, స్నేహితులను పిలిచి అబ్బాయి అంజనీ చౌహాన్ నల్లగా ఉన్నాడు కాబట్టి తాను పెళ్లి చేసుకోనని చెప్పింది. దాంతో పెళ్లికొడుకుకు సంబంధించిన ఇద్దరు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి విషయాల్లో తాము ఏమీ చేయలేమని, అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయించడం కుదరదని వాళ్లు తెగేసి చెప్పారు.
బిహార్‌లో గత రెండు వారాల్లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఏప్రిల్ చివరివారంలో కూడా ఇలాగే ఓ ఘటన జరిగింది. సమస్తిపూర్ జిల్లాలో ఇలాగే ఓ అబ్బాయి నల్లగా ఉన్నాడని ఓ అమ్మాయి పెళ్లికి నిరాకరించింది. పెళ్లికొడుకులు అందంగా లేరని, నిరక్షరాస్యులని, తాగుబోతు అని, డ్రగ్స్ అలవాటు ఉందని, చెవుడు ఉందని, లేదా నిరుద్యోగి అని.. ఇలా రకరకాల కారణాలతో అమ్మాయిలు సంబంధాలు నిరాకరిస్తున్నారు. రోజులు మారిపోయాయని, అమ్మాయిలు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారని, ఇక వాళ్లు ఎందుకు రాజీ పడతారని పెళ్లికి వచ్చిన ఓ పెద్దాయన వ్యాఖ్యానించారు.