
దద్దరిల్లిన కలెక్టరేట్
సేలం: సేలం కలెక్టరేట్ ఆందోళనకారులతో సోమవారం దద్దరిల్లింది. పోలీసుల కష్టడీలోకి తీసుకున్న మెకానిక్‌లను కోర్టులో హాజరుపరచాలని బైక్ మెకానిక్‌ల సంఘం సభ్యులు ఆందోళన చేశారు. తమ నుంచి హైవే శాఖ చేజిక్కించుకున్న స్థలానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. సేలం జిల్లా ఓమవూలురుకు చెందిన వ్యక్తి పచ్చము త్తు. ఇతను గత 24వ తేదీ అక్కడ ఉన్న ఓ బ్యాంకులో డబ్బులు తీసుకుని బైకులోని బాక్స్‌లో పెట్టుకుని బయలుదేరాడు. మార్గం మధ్యంలో బైకు టైర్ పంక్చర్ అయ్యింది.
శేఖర్ అనే వ్యక్తి పంక్చర్ దుకాణంలో బండి ని నిలిపి, సరిచేసుకుని అక్కడ ఉన్న ఓ మెకానిక్‌కు చెప్పి బయటకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత బైకులోని బాక్సులో చూస్తే డబ్బులు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓమలూరు పోలీసులు అక్కడికి వచ్చి గోకుల్‌కన్నన్, శరవణన్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విషయంగా మరో ఏడుగురు బైకు మెకానిక్‌లను అదుపులోకి తీసుకున్నారు.
నాలుగు రోజులుగా తొమ్మిది మంది బైకు మెకానిక్‌ల జాడ కనిపించలేదు. ఆగ్రహం చెందిన సేలం జిల్లా మెకానిక్ సంఘ నాయకులు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది బైకు మెకానిక్‌లను వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. ఆందోళన కారణంగా గంట పాటు ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.
రైతుల ఆందోళన
సేలం నుంచి ఉలుందూరుపేట వరకు జాతీయ రహదారి విస్తరణ కోసం ఆ ప్రాంతాల్లోని రైతుల నుంచి రవాణా శాఖ భూమిని కైవసం చేసుకుంది. అందుకు తగిన పరిహారాన్ని ఇవ్వలేదు. ఎన్ని సార్లు విన్నవించుకున్నా అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో బాధిత రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. సేలం - ఉలుందూరుపేట మార్గంలో రవాణా శాఖకు ఇచ్చిన భూమికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు.