మెదడు బాగా పనిచేయాలంటే..
న్యూ ఢిల్లీ: మెదడు క్రియాశీలకంగా పనిచేయాలంటే ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాలని చెబుతున్నారు పరిశోధకులు. ఇలా ఎక్కువ భాషలను నేర్చుకోవడం, ఉపయోగించడం వలన వృత్తి పరంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతోందని జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్.. భారతీయులపై జరిపిన పరిశోధనలో నిర్థారించింది.
ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఒక భాష నుండి ఇంకో భాషలోకి తమ మెదళ్లను సందర్భానుసారం ట్యూన్ చేసుకొని ఉపయోగించడం మూలంగా మెదడు నిర్మాణాత్మకంగా బాగా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒకే భాషలో ప్రావీణ్యం ఉన్నవారితో పోల్చితే.. ఒకటి కంటే ఎక్కువ భాషలు ఉపయోగించేవారు మానసిక సంబంధమైన వ్యాధులకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నయని పరిశీలనలో తేలింది. దేశంలో మెదడు సంబంధిత రుగ్మతలతో బాధ పడేవారి సంఖ్య 40 లక్షలకు పైగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2030 నాటికి రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.