
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం బిల్‌గేట్స్ సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు బిల్‌గేట్స్ సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. పలు అంశాలపై వారు సంప్రదింపులు జరిపారు. బిల్ గేట్స్‌తో తన భేటీ అద్భుతంగా సాగిందని, ఆయనతో పలు అంశాలపై చర్చించడం స్ఫూర్తివంతంగానే ఉంటుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తన వినూత్న ఆలోచనా విధానం, క్షేత్రస్ధాయిలో పనిచేయడం ద్వారా భూమండలాన్ని జీవించేందుకు మెరుగైన ప్రదేశంగా మలచడంలో నిమగ్నమయ్యారని కొనియాడారు. ఇక అంతకుముందు బిల్ గేట్స్ భారత్‌లో వైద్య విధానాలపై నీతిఆయోగ్ రూపొందించిన నివేదిక విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత వైద్య వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తోందని, డిజిటల్ టూల్స్‌తో దీన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పోలియో నిర్మూలనకు భారత ప్రభుత్వం సమర్ధంగా పనిచేస్తోందని ప్రశంసించారు. వ్యవసాయ గణాంక శాస్త్రంపై జరిగిన ఎనిమిదో అంతర్జాతీయ సదస్సులోనూ గేట్స్ పాల్గొన్నారు.