
న్యూఢిల్లీ : రానున్న దశాబ్ధంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్ధాపకులు బిల్ గేట్స్ అన్నారు. దేశం అనుసరిస్తున్న ఆధార్ వ్యవస్థ, ఆర్థిక సేవలు, ఫార్మా రంగాల్లో కనబరుస్తున్న సామర్ధ్యం ప్రశంసనీయమైనవని కొనియాడారు. దేశంలో ఆర్థిక మందగమనంపై ఆందోళన నెలకొనడంతో పాటు స్లోడౌన్ ప్రభావం మరికొన్నేళ్లు సాగుతుందనే భయాల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి బిల్ గేట్స్ భారత ఎకానమీపై సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్వల్ప కాలంలో ఏం జరుగుతుందనేది తనకు తెలియకపోయినా, రానున్న దశాబ్ధంలో భారత్‌లో అనూహ్య వృద్ధి రేటు నమోదవుతుందని వ్యాఖ్యానించారు.
110 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌ను వెనక్కునెట్టి 64 ఏళ్ల బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా తిరిగి తన స్ధానాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గేట్స్ మూడు రోజులు భారత్‌లో పర్యటిస్తారు. భారత్‌లో ఆధార్ వ్యవస్థ పనితీరును గేట్స్ ప్రశంసించారు. ఇతర దేశాల్లోనూ ఈ తరహా వ్యవస్ధను ప్రవేశపెట్టేందుకు మార్గాలను అన్వేషించాలని అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు భారత్‌లో అద్భుత వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment