
ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి బయోమెట్రిక్
♦ వచ్చే నెలలో అమల్లోకి
♦ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ:
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు జులై నుంచి హాజరుని బయోమెట్రిక్ విధానంలో అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం ఎం.కుట్టీ గురువారం అన్ని ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించారు. ఉద్యోగులందరూ కార్యాలయాల్లో విధిగా ఈ విధానాన్ని పాటించాలని పేర్కొన్నారు.
ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులందరూ విధిగా ఉదయం 9:30 గంటలకు కార్యాలయాల్లోకి రావాలని..అలాగే సాయంత్రం 6:30 గంటల వరకు కచ్చితంగా ఆఫీసుల్లో ఉండాలని పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వులపై ఉద్యోగుల్లో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ విధానానికి మద్దతు తెలుపుతుండగా..మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగసంఘాల్లో ఐక్యత తీసుకురావడానికి గాను వచ్చే వారంలో అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో రెండుమూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.