వాళ్లంతే అంటున్న రాహుల్
వాళ్లంతే అంటున్న రాహుల్
Published Fri, Sep 8 2017 3:57 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM
సాక్షి, ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. అధికారం నిలుపుకునేందుకు మోదీ, బీజేపీలు సమాజాన్ని విభజించడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. హర్యానాలో జాట్లు, జాట్లేతరుల మధ్య, మహరాష్ట్రలో మరాఠాలు, మరాఠేతరుల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల విచ్ఛిన్న రాజకీయాలను కేవలం కాంగ్రెస్ సిద్ధాంతం మాత్రమే దీటుగా ఎదుర్కోగలదని అన్నారు.
మరాఠ్వాడా ప్రాంతంలోని పర్బానిలో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నోట్ల రద్దుతో దేశంలోని బ్లాక్ మనీ అంతా వైట్‌గా మారిందన్నారు. తొలుత నోట్ల రద్దుతో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుతాయని చెప్పిన పాలకులు, ఆ తర్వాత నల్లధనం నియంత్రించేందుకే ఈ నిర్ణయమని చెప్పారన్నారు. అయితే 90 శాతం బ్లాక్ మనీ రియల్‌ఎస్టేట్, బంగారం రూపంలో ఉంటుందని దేశంలో ప్రతిఒక్కరికీ తెలిసిందేనన్నారు.
రైతులు, కార్మికులు, గృహిణుల కష్టార్జితం కోసం మోదీ ఎందుకు పాకులాడారో అర్థం కావడంలేదన్నారు. రద్దయిన నోట్లలో 99 శాతం తిరిగి బ్యాంకులకు చేరిందని చెప్పడానికి ఆర్‌బీఐకి ఏడాది సమయం పట్టిందని రాహుల్ విస్మయం వ్యక్తం చేశారు.జీడీపీ 4.5 శాతానికి తగ్గడం పట్ల ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. దీనికి ప్రధాని మోదీయే బాధ్యత వహించాలన్నారు.
Advertisement