సాక్షి, న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను దేశ భక్తుడని పార్లమెంట్‌లో వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి బీజేపీ తొలగించింది. ప్రజ్ఞా వ్యాఖ్యలపై విపక్షాలు పాలక పార్టీని టార్గెట్ చేయడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ నుంచి ఆమెను తప్పించడంతో పాటు ఈ పార్లమెంట్ సమావేశాల వరకూ పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆమెను అనమతించమని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో మంగళవారం ఆమె చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని, ఇలాంటి ప్రకటనలు, సిద్ధాంతాలను బీజేపీ ఎన్నడూ బలపరచదని చెప్పారు. మరోవైపు నాథూరాం గాడ్సేను దేశభక్తుడనే ఆలోచనకు స్వస్తిపలకాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
రాహుల్ ఫైర్
మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా కొనియాడిన ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఉగ్రవాదైన ప్రజ్ఞా సింగ్ మరో ఉగ్రవాది గాడ్సేను దేశభక్తుడని కొనియాడారు...ఇది దేశ పార్లమెంట్ చరిత్రలోనే విచారకరమైన దినమని రాహుల్ ట్వీట్ చేశారు. ఎస్పీజీ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో ప్రకంపనలు సృష్టించాయి. ఆమె వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment