'బీజేపీకి విజన్, అజెండా అంటూ లేవు'
భారతీయ జనతా పార్టీకి విజన్ కాని, ప్రత్యేక అజెండా అంటూ ఏం లేవు అని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ వాళ్లు చివరికి మేనిఫెస్టో కూడా విడుదల చేయలేకపోయారంటూ ఆ పార్టీపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.
మేనిఫెస్టో అనేది విడుదల చేయడానికి వెనుకంజ వేస్తున్న బీజేపీ... ఎన్నికల తర్వాత ప్రజలకు ఏం మేలు చేయగలుగుతుందంటూ ఎద్దేవా చేశారు. 'బీజేపీ లేక ఇతర ఏ పార్టీ అయినా సరే వారు అడిగితే నేను ఐదు ప్రశ్నలకేంటి... వెయ్యి ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వగలను' అంటూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇతర రాజకీయ పార్టీలకు సవాలు విసిరారు.