కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. నూతన ప్రభుత్వం త్వరలో తన మొదటి బడ్జెట్‌ను సమర్పించనుంది. ఈ నేపధ్యంలో మంత్రి సీతారామన్‌కు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే చర్యలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన సీతారామన్ తన ఆర్థిక ఎజెండాలో భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే 2047 నాటికి దేశాన్ని ‘అభివృద్ధి చెందిన భారతదేశం’గా మార్చడానికి తగిన ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసేదిశగా ముందడుగు వేయాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ నుండి డివిడెండ్ రూపంలో ప్రభుత్వం అందుకున్న రూ. 2.11 లక్షల కోట్లు దేశ ఆర్థిక స్థితికి మెరుగుదలకు సహాయకారిగా మారినట్లు నిరూపితమయ్యింది.
మోదీ 3.0 ప్రభుత్వానికి దేశంలోని వ్యవసాయ రంగంలో ఒత్తిడిని పరిష్కరించడం, ఉపాధి కల్పన, మూలధన వ్యయాల వేగాన్ని కొనసాగించడం, ఆర్థిక ఏకీకరణ మార్గంలో ఉండటానికి ఆదాయ వృద్ధిని పెంచడం వంటివి కీలకంగా మారనున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు బీమా కంపెనీల ప్రైవేటీకరణకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
నిర్మలా సీతారామన్ 2019లో తొలిసారిగా ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుండి ఆమె ఈ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. సీతారామన్ స్వతంత్ర భారతదేశంలో మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశం కోవిడ్ -19 మహమ్మారితో ఉత్పన్నమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వాటిని సమర్థవంతంగా దాటగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment