![BJP to Focus on Spadework for 2024 Lok Sabha Polls - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/11/FJ4A_FNAAAAE64Z.jpg.webp?itok=unpQkiLU)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఆ దిశగా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తాలూకు ఊపును కొనసాగించేలా పార్టీ నేతలను, శ్రేణులను సమాయత్తం చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 50 శాతానికి పైగా ఓట్ల సాధనను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది!
ఈ మేరకు రాష్ట్రాలవారీగా ముఖ్య నేతలకు అధినాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. ఇటీవలి బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు నేతలందరికీ ఈ మేరకు స్పష్టం చేయడంతో పాటు ఆ దిశగా బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం.
50 శాతం ఓట్ల లక్ష్యసాధన కోసం 2019తో పోలిస్తే ఈసారి వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయానికి వచి్చనట్టు చెబుతున్నారు. ఇందుకు ఎన్డీఏ మిత్రపక్షాలను ఒప్పించే ప్రయత్నాలకు పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. 2019తో పోలిస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గడం కూడా తాను ఎక్కువ చోట్ల పోటీ చేసేందుకు వీలు కలి్పస్తుందని బీజేపీ భావిస్తోంది.
పంజాబ్‌లో అకాలీదళ్, బిహార్లో జేడీ(యూ)తో బీజేపీకి ఇప్పటికే తెగదెంపులవడం తెలిసిందే. తమిళనాడులో అన్నాడీఎంకే, రాజస్థాన్‌లో ఆరెలీ్పలతోనూ అటూ ఇటుగా అదే పరిస్థితి. ఇక మహారాష్ట్రలో శివసేన చీలికలో ఏక్‌నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్దతుగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. కనుక షిండే సేనకు వీలైనన్ని తక్కువ లోక్‌సభ సీట్లిచ్చి అత్యధిక స్థానాల్లో తానే పోటీ చేసేలా కన్పిస్తోంది.
నెలాఖరు నుంచి జాబితాలు...!
జనవరి నెలాఖరు, లేదా ఫిబ్రవరి తొలి వారం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలు విడుదలయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వంటి దిగ్గజాల పేర్లుంటాయి. తద్వారా ఎన్నికల వాతావరణానికి దేశవ్యాప్తంగా ఊపు తేవాలన్నది లక్ష్యం’’ అని వివరించాయి. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా మోదీ, షా, రాజ్‌నాథ్ పేర్లు తొలి జాబితాలోనే చోటుచేసుకోవడం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలు నెగ్గేందుకు బీజేపీ పలు చర్యలు చేపడుతోంది...
1. తొలి జాబితాలో వీలైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ముఖ్యంగా 2019లో పార్టీ ఇబ్బందులను ఎదుర్కొన్న, తక్కువ మెజారిటీతో నెగ్గిన స్థానాలపై ఈ జాబితాలో బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. నిజానికి వీటిని ‘సవాలు స్థానాలు’గా ఎప్పుడో గుర్తించింది. గత ఎన్నికల ఫలితాలు రాగానే వాటిపై గట్టిగా దృష్టి పెట్టింది. ఆయా స్థానాల్లో పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ప్రయతి్నస్తూ వస్తోంది.
2. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో బీజేపీ 436 చోట్ల పోటీ చేసింది. 303 స్థానాలు నెగ్గి 133 చోట్ల ఓటమి చవిచూసింది. వాటితో పాటు బాగా బలహీనంగా మరో 31 స్థానాలపై బీజేపీ ఈసారి బాగా ఫోకస్ చేస్తోంది. వీటిని తొలి జాబితాలో చేర్చనుంది.
3. ఈ 164 ‘టార్గెటెడ్’ స్థానాల్లో గెలుపు బాధ్యతలను అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించనుంది. వీటినిప్పటికే రెండు గ్రూపులుగా బీజేపీ విభజించింది. 45 మంది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు స్థానాల చొప్పున బాధ్యతలను భుజాలకెత్తుకుంటారు.
4. ఢిల్లీ పీఠానికి రాచబాటగా పరిగణించే కీలకమైన ఉత్తరప్రదేశ్‌పై ఈసారి బీజేపీ మరింతగా ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలో 80 లోక్‌సభ సీట్లకు గాను 2019 ఎన్నికల్లో 16 చోట్ల బీజేపీ ఓటమి చవిచూసింది. అనంతరం రాయ్‌బరేలీ, మెయిన్‌పురి స్థానాలను ఉప ఎన్నికల్లో చేజిక్కించుకుంది. మిగతా 14 లోక్‌సభ స్థానాల్లో పార్టీ బాగా బలహీనంగా ఉందన్న అంచనాతో వాటిపై బాగా దృష్టి పెడుతోంది. రాయ్‌బరేలీ, మెయిన్‌పురితో పాటు ఈ 14 స్థానాలకూ అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే యోచనలో ఉంది. వీటిలో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలుగా చెప్పే పలు స్థానాలున్నాయి.
5. ఇలాగే బిహార్లో కూడా క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్నట్టు భావిస్తున్న నవడా, సుపౌల్, కిషన్‌గంజ్, కతీహార్, ముంగేర్, గయ వంటి స్థానాలు కూడా బీజేపీ తొలి జాబితాలోనే ఉంటాయని భావిస్తున్నారు.
6. మధ్యప్రదేశ్‌లో పీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ కురువృద్ధుడు కమల్‌నాథ్ కంచుకోటైన ఛింద్వారాతో పాటు ఆ పార్టీకి పట్టున్న పలు స్థానాలపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ఛింద్వారా బాధ్యతలను కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు అప్పగించారు.
7. కేరళలో కూడా త్రిసూర్, తిరువనంతపురం, పథినంతిట్ట వంటి స్థానాల్లో విజయవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు బీజేపీ అంచనా వేస్తోంది. త్రిసూర్ నుంచి సినీ హీరో సురేశ్ గోపిని బరిలో దించుతుందన్న అంచనాలున్నాయి.
8. మహారాష్ట్రలో ఎన్సీపీ చీఫ్ వరద్ పవార్ కంచుకోటైన బారామతితో పాటు బుల్దానా, ఔరంగాబాద్ వంటి లోక్‌సభ స్థానాల్లో ఈసారి ఎలాగైనా పాగా వేసి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇక పంజాబ్‌లో అమృత్‌సర్, ఆనంద్‌పూర్ సాహిబ్, భటిండా, గురుదాస్‌పూర్ తదితర లోక్‌సభ సీట్లపై కూడా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
9. పంజాబ్, మహారాష్ట్ర, బిహార్లలో స్థానిక పారీ్టలతో బీజేపీ పొత్తు చర్చలు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. పరిస్థితులు, అవసరాలను బట్టి ఈ రాష్ట్రాల్లో ఇచి్చపుచ్చుకునే ధోరణితో వెళ్లాలన్న యోచనలో అధినాయకత్వం ఉంది.
10. 70 ఏళ్లు పైబడ్డ నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వొద్దన్న యోచన కూడా బీజేపీ అధినాయకత్వం పరిశీలనలో ఉందని విశ్వసనీయ సమాచారం! మూడుసార్లకు మించి నెగ్గిన వారిని కూడా పక్కన పెట్టనుందని చెబుతున్నారు. వారికి బదులు కొత్త ముఖాలకు చాన్సివ్వాలని మోదీ–షా ద్వయం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారని బీజేపీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. ఇది నిజమే అయితే అందరికీ వర్తింపజేస్తారా, మినహాయింపులుంటాయా అన్నది చూడాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment