మోదీ శంఖారావం | PM Narendra Modi to address concluding session of BJP national executive meet | Sakshi
Sakshi News home page

మోదీ శంఖారావం

Published Wed, Jan 18 2023 5:41 AM | Last Updated on Wed, Jan 18 2023 5:41 AM

PM Narendra Modi to address concluding session of BJP national executive meet - Sakshi

న్యూఢిల్లీ: ఏడాదిన్నర ముందే ప్రధాని మోదీ ఎన్నికల శంఖం పూరించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు కేవలం 400 రోజుల దూరంలోనే ఉన్నాయి. ఇక టాప్‌ గేర్లో దూసుకెళ్లాల్సిన సమయం వచ్చేసింది. చరిత్ర సృష్టిద్దాం పదండి’’ అంటూ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశ రాజధానిలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చివరి రోజైన మంగళవారం కీలకాంశాలపై లోతైన చర్చ జరిగింది. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన 350 మంది బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు, సీఎంలు కూలంకషంగా చర్చించారు.

చివరగా మోదీ కీలకోపన్యాసం చేశారు. భావి కార్యాచరణపై నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అతి విశ్వాసానికి ఎక్కడా చోటివ్వొద్దని హెచ్చరించారు. ‘‘బోహ్రాలు, పాస్మాండాలు, సిక్కులు... ఇలా సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ కండి. ఎన్నికల లబ్ధి గురించి ఆలోచించకుండా వారి సంక్షేమం కోసం పాటుపడండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల వద్దకు తీసుకెళ్లండి. అన్నిచోట్లా, ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా ప్రత్యేక కార్యక్రమాలు, మోర్చాలు నిర్వహించండి.

అక్కడి ప్రజలకు మరింత చేరువ కండి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా అక్కడికీ చేరవేయండి. సరిహద్దు గ్రామాల యువతను బీజేపీ కార్యకర్తలుగా తీర్చిదిద్దండి. తద్వారా అక్కడా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయండి. 18–25 ఏళ్ల యువతకు దేశ రాజకీయ చరిత్ర తెలియదు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన విచ్చలవిడి అవినీతి, తప్పిదాలు తెలియవు. వీటన్నింటిపైనా వారికి అవగాహన కల్పించండి. అంతటి దుష్పరిపాలనను బీజేపీ ఎలా సుపరిపాలనగా మార్చి చూపించిందో యువతలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అని సూచించారు. ‘‘రానున్నది మన దేశానికి అత్యుత్తమ సమయం. వచ్చే పాతికేళ్ల అమృత కాలాన్ని కర్తవ్య కాలంగా మార్చుకుని కష్టపడితేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. ప్రజలకు సేవ చేసేందుకు అన్ని విధాలుగా కష్టపడదాం’’ అన్నారు.

‘‘అతి విశ్వాసానికి పోతే ప్రతికూల ఫలితాలు తప్పవు. 1998లో మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్‌సింగ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా బీజేపీ కేవలం అతి విశ్వాసం వల్లే ఓడింది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం’’ అంటూ నేతలను హెచ్చరించారు. మోదీ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా మాత్రమే గాక సరికొత్త దిశానిర్దేశం చేసేదిగా సాగిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. ప్రసంగ విశేషాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘ఏక్‌ భారత్, శ్రేష్ఠ్‌ భారత్‌’ సాకారానికి కృషి చేయాల్సిందిగా బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు. పార్టీ కంటే దేశానికి ప్రాధాన్యమిస్తూ రాజకీయ నాయకునిగా గాక రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రసంగం సాగింది’’ అని ఫడ్నవీస్‌ చెప్పారు.

ధర్తీ బచావో...
పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దామని బీజేపీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చారు. ‘‘బేటీ పఢావో మాదిరిగా ధర్తీ బచావో (భూమిని కాపాడండి) ఉద్యమానికి శ్రీకారం చుడదాం. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకుందాం. కాశీ–తమిళ సంగమం తరహాలో భిన్న సంస్కృతులను, ప్రాంతాలను కలిపే వారధిగా పార్టీని తీర్చిదిద్దుకుందాం’’ అని సూచించారు.

సినిమాలపై అనవసర వ్యాఖ్యలొద్దు: మోదీ
సినిమాలు తదితర అంశాలపై అనవసర ప్రకటనలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని బీజేపీ నేతలను, శ్రేణులను మోదీ ఆదేశించారు. ‘‘ఏదో సినిమా గురించి మనవాళ్లలో ఎవరో ఏదో అంటారు. టీవీల్లో, మీడియాలో రోజంతా అదే వస్తుంది. అభివృద్ధి అజెండా తదితర అసలు విషయాలన్నీ పక్కకు పోతాయి. అందుకే అనవసర వ్యాఖ్యలేవీ చేయకండి’’ అని కరాఖండిగా చెప్పినట్టు సమాచారం. షారుఖ్‌ఖాన్‌ నటించిన పఠాన్‌ సినిమాలో కాషాయాన్ని కించపరిచారంటూ దాని బహిష్కరణకు నరోత్తం మిశ్రా, రామ్‌ కదమ్‌ తదితర బీజేపీ నేతలు, మంత్రులు బహిరంగంగా పిలుపునివ్వడం, దానిపై విమర్శలు చెలరేగడం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement