లక్నో : అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 87మంది భారతీయ జనతా పార్టీ నేతలపై వేటు పడింది. వీరందర్ని ఆరేళ్లపాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు బీజేపీ గురువారం ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకుగాను వీరిపై వేటు వేసినట్లు ఆ రాష్ట్ర జనరల్ సెక్రటరీ విద్యా సాగర్ సోన్‌కర్ వెల్లడించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కని పలువురు నేతలు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పలుచోట్ల బీజేపీ అభ్యర్థులపైనే పోటీ చేయగా, మరికొందరు ప్రతిపక్షానికి మద్దతు ఇచ్చారు.దీంతో క్రమశిక్షణా చర్య కింద వారిపై వేటు పడింది.
ఈ నిర్ణయానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ఆమోదం తెలిపారు. కాగా బహిష్కరణకు గురైనవారిలో కపిల్ దేవ్ కొరి (రాంపూర్), వీకె షైనీ (మొరాదాబాద్), ఇంద్రదేవ్ సింగ్ (బిజ్నోర్), శాంతి స్వరూప్ శర్మ (బులంద్‌షహర్), చంద్రశేఖర్ రావత్ (హత్రాస్), ఆశిష్ వశిష్ట (బాగ్పాట్), ప్రతిభా సింగ్, మహేశ్ నారాయణ్ తివారీ, నిర్మల్ శ్రీవాత్సవ, వైభవ్ పాండే, విద్యాభూషణ్ ద్వివేది (గోండా) తదితరులు ఉన్నారు.