పలు పార్టీలకు బీజేపీ సెగ | bjp fear in political parties | Sakshi
Sakshi News home page

పలు పార్టీలకు బీజేపీ సెగ

Published Tue, Aug 1 2017 3:09 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

పలు పార్టీలకు బీజేపీ సెగ - Sakshi

పలు పార్టీలకు బీజేపీ సెగ

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇతర పార్టీలకు వణుకు పుట్టిస్తోంది.

న్యూఢిల్లీ: గుజరాత్‌లో పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ ఎమ్మెల్సీలను పలు ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల ప్రజా ప్రతినిధులపై కన్నేసిందన్న వార్తలు అక్కడి రాజకీయ పార్టీలను వణికిస్తున్నాయి. ఆగస్టు 8వ తేదీన జరుగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో జూలై 28 నుంచి బీజేపీలోకి కాంగ్రెస్‌ పార్టీ శాసన సభ్యుల వలస ప్రారంభమైన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఆరుగురు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అలా పార్టీ ఫిరాయించారు. మిగతా వారిని రక్షించుకునేందుకు కాంగ్రెస్‌ 44 మంది ఎమ్మెల్యేలను కర్ణాటకలోకి ఓ రిసార్ట్‌కు తరలించింది.

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయలను ఇచ్చి తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తోందని గుజరాత్‌ కాంగ్రెస్‌ నాయకుడు శక్తిసింహ్‌ గోహిల్‌ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ గుజరాత్‌ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. గుజరాత్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్‌ను ఓడించేందుకు గుజరాత్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ విప్‌ బల్వంత్‌సింహ్‌ రాజ్‌పుత్‌ను బీజేపీ పోటీకి పెట్టింది. ముందుగా ఆయన్ని గెలిపించుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహిస్తోంది.

ఈ నేపథ్యంలో కర్ణాటకలో కూడా పార్టీ నుంచి భారీగానే వలసలు ఉండవచ్చని కాంగ్రెస్‌ పార్టీ భయపడుతోంది. మెజారిటీ సీట్లు రాకుండానే గోవాలో, మణిపూర్‌లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ మొన్న బీహార్‌ ప్రభుత్వంలో పాగా వేసిందని, ఇప్పుడు మిగతా రాష్ట్రాలపై దష్టి పెట్టిందని కర్ణాటక కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మానికా టాగూర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒడిశాలో పాలకపక్ష బిజూ జనతా దళ్‌ నుంచి బీజేపీకి వలసలు ఉండకపోవచ్చని, తమ పార్టీ సభ్యులందరూ పార్టీకి కట్టుబడిన వాళ్లని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు భర్తహరి మహతాబ్‌ వ్యాఖ్యానించారు. అంత నమ్మకం తనకు లేదని, ఇప్పటికే ఈ విషయంలో పార్టీ నాయకుల మధ్య గందరగోళం నెలకొని ఉందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మహతాబ్‌ సహచరుడు మీడియాతోని చెప్పారు.

తమిళనాడులో కూడా ద్రవిడ పార్టీలు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నాటి నుంచి తమిళ రాజీకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకుంటోందని, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా బీజేపే పరోక్షంగా నడిపిస్తోందని డీఎంకే నాయకురాలు కనిమోలి ఆరోపిస్తున్నారు. బీజేపీయేతర పక్షాల మధ్య సరైన ఐక్యత లేకపోవడం వల్లనే బీజేపీ అప్రజాస్వామిక ఎత్తులు ఫలిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, బహుజన సమాజ్‌ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ ఇప్పటికీ రాజీనామాచేసి బీజేపీలో చేరిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement