బీజేపీ కొత్త తరహా కుట్రలు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ బేరసారాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో బీజేపీ 'హార్స్-ట్రేడింగ్'కు పాల్పడిందని విమర్శించింది. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
'ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. డెమొక్రసీ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాడుతుంద'ని ట్విటర్ లో కాంగ్రెస్ పోస్ట్ చేసింది. 'ముందుగా అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇప్పుడు ఉత్తరాఖండ్ సర్కారును పడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కుట్రలతో నరేంద్ర మోదీ సర్కారు నిజస్వరూపం వెల్లడవుతోంద'ని ట్వీట్ చేసింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతినడంతో ఇలాంటి కొత్త తరహా కుట్రలకు బీజేపీ పాల్పడుతోందని ధ్వజమెత్తింది. హార్స్ ట్రేడింగ్, అధికారం, డబ్బు దుర్వినియోగంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సెగ పెడుతోందని ఆరోపించింది. పీపీఎఫ్, పొదుపు ఖాతాల వడ్డీ రేట్లు భారీగా తగ్గించి సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందని పేర్కొంది. ఉత్తరాఖండ్ లో సిగ్గులేకుండా రాజకీయ బేరసారాలు సాగిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు దుయ్యబట్టారు.