సాక్షి, కొత్తగూడెం/రాయ్‌పూర్/బస్తర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవికి చెందిన కాన్వాయ్ లక్ష్యంగా మంగళవారం ఐఈడీ పేల్చారు. వెంటనే చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే మాండవి(40)తో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుశ్చర్యపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ అప్రమత్తతతో వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని ఆదేశించింది.
ఐఈడీ పేల్చి.. కాల్పులు జరుపుతూ
చివరి రోజు ఎన్నికల ప్రచారం ముగించుకున్న భీమా మాండవి దంతెవాడ జిల్లాలోని కువాకొండా నుంచి బచేలీకి బయలుదేరారు. వీరి కాన్వాయ్ శ్యామలగిరిలోని ‘నకుల్‌నార్’ ప్రాంతానికి రాగానే అక్కడే మాటేసిన మావోలు మందుపాతరను పేల్చారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. జవాన్ల శరీర భాగాలన్నీ తెగిపడి ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఐఈడీ దాడి నుంచి తేరుకునేలోపే మావోయిస్టులు అన్నివైపుల నుంచి చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరుపుతూ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందజేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి.
అనంతరం కూంబింగ్ ప్రారంభించాయి. ఈ దుర్ఘటనలో చనిపోయిన జవాన్లను డ్రైవర్ దంతేశ్వర్ మౌర్య, ఛగ్గన్ కుల్దీప్, సోమ్డు కవాసీ, రామ్‌లాల్ ఒయామీగా అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్ని బహిష్కరించాలని మావోలు ఇటీవల పిలుపునిచ్చారు. మరోవైపు దంతెవాడ దాడి నేపథ్యంలో భద్రాచలం డిపో నుంచి వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేశారు.
ముందుగానే హెచ్చరించాం: ఎస్పీ
కువాకొండ మార్గంలో రాకపోకలు వద్దని తాము హెచ్చరించినా మాండవి వినిపించుకోలేదని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. తమ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఆయన గత రెండ్రోజులుగా ఇదే మార్గంలో రాకపోకలు సాగించారని వ్యాఖ్యానించారు. ‘ఈ మార్గమంతా మావోయిస్టులు ల్యాండ్‌మైన్లను అమర్చారు. మాండవి ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో సోమవారం కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఎమ్మెల్యే మాండవి కదలికలతో అప్రమత్తమైన మావోయిస్టులు సోమవారం రాత్రి ఐఈడీలను అమర్చి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బస్తర్ డివిజిన్‌లోని 12 స్థానాలకు గానూ 11 సీట్లను కాంగ్రెస్ దక్కించుకోగా, ఒక్క దంతెవాడలో మాత్రం మాండవి గెలుపొందారు.
ఎన్నికలు ఆగవు
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ లోక్‌సభ స్థానానికి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11నే ఎన్నికలు జరుగుతాయని ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రధానాధికారి సుబ్రత్ చెప్పారు. దాడి అనంతరం తొలి, రెండో విడత పోలింగ్ జరిగే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 11, 18, 23న 3 విడతల్లో ఎన్నికల నిర్వహణ కోసం 80,000 మంది భద్రతాబలగాలతో పాటు డ్రోన్లను ఛత్తీస్‌గఢ్‌లో మోహరించారు. మరోవైపు రాయ్‌పూర్‌లో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం భూపేశ్ బాఘేల్.. మావోలకు వారికి అర్థమయ్యే భాషలోనే బుద్ధి చెప్పాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment