dantewada district
-
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో స్పష్టతకు రాని మృతుల సంఖ్య
నారాయణ్‌పుర్ - దంతెవాడ సరిహద్దులో శుక్రవారం పోలీసుల జరిపిన భారీ ఎన్కౌంటర్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 40 మంది మరణించగా.. పోలీసులు మాత్రం 31మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు.అయితే, మిగిలిన తొమ్మిది మంది ఎవరనేది చెప్పే ప్రయత్నం చేయలేదు పోలీసులు. పైగా ఆ తొమ్మది మంది మృతదేహాల్ని ఎవరివి అనేది దృవీకరించలేదు.ఇక ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళ మావోయిస్టులలో దళ కమాండర్ ఒకరు మరణించినట్లు ధ్రువీకరించారు. మహారాష్ట్ర నుండి 150 మంది మహిళ పోలీస్ కమాండోలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. మృతి చెందిన 31 మంది మావోయిస్టులపై సుమారు కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. -
మావోయిస్టు నేత మృతి
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మూడు దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్ మావోయిస్టు నేత ఒకరు చనిపోయారు. అతడిని మావో డివిజినల్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గురువారం రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించారు. ఈయనపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నాయి. -
మూడు క్యాంపులపై మావోయిస్టుల దాడి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం మావోయిస్టులు, జవాన్ల పరస్పర కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లో ఏర్పాటుచేస్తున్న పోలీసు క్యాంప్‌లపై మావోలు మెరుపుదాడికి దిగారు. పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారం, చింతవాగులో నిర్మించిన క్యాంప్‌లు, పామేడు పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు దాడికి దిగారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో లాంచర్లతో దాడిని ప్రారంభించిన మావోయిస్టులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురుదాడికి దిగగా తెల్లవార్లూ ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆయా ప్రాంతాల ప్రధాన దారులపై చెట్లు నరికి అడ్డంగా వేసి నిప్పుపెట్టి రహదారిని మూసి వేశారు. ఆ మార్గాల గుండా వస్తున్న గ్రామస్తులను వెనక్కి పంపించారు. మూడు చోట్లా ఏకకాలంలో రాకెట్ లాంచర్లు విసురుతూ, మందుపాతరలు పేల్చుతూ భయోత్పాతం సృష్టించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సైతం ఎదురుదాడికి దిగాయి. ధర్మారం క్యాంపు నిర్మాణ పనులు కొనసాగుతుండగా అందులోని జవాన్లతో పాటు పని చేసేందుకు గుంటూరు నుంచి వచి్చన 40 మంది కూలీలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ధర్మారం క్యాంప్‌పై జరిపిన దాడిలో తొమ్మిది మంది జవాన్లు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. -
గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలి జవాన్ మృత్యువాత
దంతెవాడ(ఛత్తీస్‌గఢ్): బీఎస్ఎఫ్ జవాను ఒకరు గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలడంతో మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. బీఎస్ఎఫ్ 70వ బెటాలియన్ జవాన్లు ఎన్నికల విధుల్లో భాగంగా కాటేకల్యాణ్ పోలీస్‌స్టేషన్‌లో మకాం వేశారు. తనిఖీల కోసం బయలుదేరి వెళ్తున్న సమయంలో బల్బీర్ చంద్ అనే జవాను వద్ద పౌచ్‌లో ఉన్న గ్రెనేడ్ ప్రమాదవశాత్తూ పేలింది. తీవ్రంగా గాయపడిన బల్బీర్‌ను వెంటనే దంతెవాడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బల్బీర్ చంద్ స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. -
కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్: దంతేవాడ జిల్లాలో కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. ఫుడ్ పాయిజన్‌తో కూడా కొంతమంది మావోలు చనిపోయినట్లు సమాచారం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. మృతిచెందినవారిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఉన్నట్లు తెలిసిందన్నారు. బస్తర్ రేంజ్ పరిధిలో 100 మందికిపైగా కరోనాతో బాధపడుతున్నారని ఎస్పీ వెల్లడించారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు, ఆంధ్ర–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని మావోయిస్టులకు కరోనా ముప్పు మంచుకొచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏవోబీలోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో దళాల్లో పలువురికి వైరస్ సోకినట్టు నిఘావర్గాలు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాయి. ఎటువంటి భయాందోళనలకు తావులేకుండా లొంగిపోతే తగిన వైద్యసేవలు అందిస్తామంటూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, విశాఖ రూరల్ పోలీసులు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. చదవండి: మావోయిస్టులకు కరోనా ముప్పు.. కొవాక్జిన్ టీకాలపై భారత బయోటెక్ కీలక నిర్ణయం..! -
DSP Shilpa Sahu; ‘అమ్మ’ఆన్ డ్యూటీ
అవసరం అయితే తప్ప ఇళ్లలోంచి కదలవద్దని జనానికి చెప్పడానికి.. ఇంట్లో ఉండవలసిన అవసరం ఉన్నప్పటికీ బయటికి వచ్చి ఎర్రటి ఎండలో డ్యూటీ చేస్తున్నారు ఐదు నెలల గర్భిణీ అయిన దంతెవాడ డీఎస్పీ శిల్పా సాహూ!! ‘సురక్షితంగా ఉండండి, మాస్కులు ధరించండి’ అని చెప్పడానికి, నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని హెచ్చరించడానికి లాఠీ చేతపట్టి.. తన కడుపులోని బిడ్డకు ప్రమాదమేమో అని కూడా తలవకుండా కరోనా సెకండ్ వేవ్ లో, సూర్యుడి భగభగల్లో, మావోయిస్టుల కదలికల నడుమ.. ఆమె తన విధులు నిర్వహిస్తున్నారు! ఎప్పుడూ గుడిలో దర్శనమిచ్చే దంతేశ్వరీ దేవి మంగళవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దంతెవాడ పట్టణ ప్రధాన కూడళ్లలో కర్ర పట్టి తిరుగుతూ, ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు చెబుతూ ఉన్నట్లే అనిపించి ఉండవచ్చు అక్కడి వారికి కొందరికైనా! ఆ ‘దంతేశ్వరీ దేవి’ పేరు శిల్పా సాహూ (29). దంతెవాడ డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్. దంతెవాడ చత్తీస్‌గఢ్ జిల్లాలో ఉంది. సాధారణంగా మావోయిస్టులను గుర్తుకు తెచ్చే ఈ ప్రాంతం.. కరోనా లాక్డౌన్ విధుల నిర్వహణలో డీఎస్పీ శిల్పా సాహూ చూపిన అంకితభావం కారణంగా ఎవరికైనా శక్తిమాతను గుర్తు తెచ్చి ఉంటే అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దేశంలోని మొత్తం యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటైన దంతేశ్వరీదేవి ఆలయం దంతెవాడలో ఉంది. ఆ తల్లి తన బిడ్డల్ని అదిలించి, కదిలించి, సంరక్షించిన విధంగానే ఇప్పుడు శిల్ప తన పౌరుల్ని కరోనా నిర్లక్ష్యం నుంచి అదిలిస్తూ, త్వరగా చేరమని ఇళ్లకు కదిలించే డ్యూటీలో ఉన్నారు. నిజానికైతే ఆమె కూడా ఇంట్లోనే ఉండిపోవలసిన పరిస్థితే. గాలి సోకితే చాలు కరోనా వచ్చేలా ఉంది. ఎండ ఆవిర్లు వదులుతోంది. మావోయిస్టులు ఎక్కడ మాటువేసి ఎటుగా వస్తోరో తెలియదు. అయినా పోలీస్ డ్యూటీ పోలీస్ డ్యూటీనే. అన్నిటినీ తట్టుకోవాలి. పౌరుల్ని కాపాడాలి. డిఎస్పీ శిల్ప కూడా అదే డ్యూటీ ఉన్నారు కానీ, ఆమె కాస్త ప్రత్యేకమైన పరిస్థితిలో డ్యూటీ చేస్తున్నారు. ఐదవ నెల గర్భిణి ఆమె. ఇక నుంచి ఆమె మరింతగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఆమెకు చెప్పే ఉంటారు. అయితే సెకండ్ వేవ్ కరోనాలో ప్రజలు మరింతగా భద్రంగా ఉండాలని చెప్పడం కోసం ఆమె బయటికి వచ్చారు. లాఠీ పట్టుకుని దంతెవాడ ప్రధాన రహదారులలో డ్యూటీ చేశారు. మాస్క్ వేసుకోని వాళ్లను, అనవసరంగా బయటికి వచ్చినవాళ్లను ఆపి, మందలించారు. కరోనా బారిన పడకుండా, ఇతరులను పడేయకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పి పంపారు. సాటి మానవులు చెబితే కోపం వస్తుందేమో కానీ, డీఎస్పీ చెబితే వినకుండా ఉంటారా? ఇప్పుడామె చేస్తున్నది బాధ్యతల్ని గుర్తు చేసే డ్యూటీ. ఒకరు గుర్తు చేయాల్సినంతగా నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రదర్శిస్తున్న పౌరులు.. గర్భిణిగా ఉండి కూడా మిట్ట మధ్యాహ్నపు ఎండలో డ్యూటీ చేయడం చూసి సిగ్గుపడే ఉంటారు. తనకు, కడుపులో ఉన్న తన బిడ్డకు కరోనా సోకుతుందేమోనన్న భయం లేకుండా శిల్ప పౌరుల క్షేమం కోసం పాటు పడటం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవాన్నే పెంచింది. గర్భంతో ఉండి కూడా ఆమె డ్యూటీ చేస్తున్నప్పటి ఫొటోను ఐపీఎస్ ఆఫీసర్, చత్తీస్‌గఢ్ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దీపాంశు కబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయగానే ‘డ్యూటీ మైండెడ్’ శిల్పపై గత 48 గంటలుగా ట్విట్టర్లో ధారాపాతంగా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ‘సెల్యూట్ టు డీఎస్పీ శిల్పా సాహూజీ! డీజీపీ శ్రీ అవస్థిగారూ.. ఆమెకు అవార్డు ప్రకటించంది. అలాగే ఆమె కోరుకుంటే కనుక ఆమెను రాయ్‌పుర్ బదలీ చేయండి’ అని ఒకరు, ‘గుడ్ జాబ్ మేమ్, ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ’ అని ఇంకొకరు.. పదులు, వందల్లో ఆమెను అభినందిస్తూ, జాగ్రత్తలు చెబుతున్నారు. రాయ్‌పుర్ చత్తీస్‌గఢ్ రాజధాని. అక్కడికి, దంతెవాడకు ఏడున్నర గంటల ప్రయాణం. రాయ్‌పుర్‌లో అయితే శిల్పకు ఈ సమయంలో సౌకర్యంగా ఉంటుందని కూడా ట్విటిజెన్‌లు ఆలోచిస్తున్నారు. సీఎం ఆమెను ఒక ఆదర్శ మహిళా అధికారిగా కీర్తించారు. ఇంతకంటే కఠిమైన డ్యూటీలనే చేశారు శిల్పి. ఎ.కె.47 ధరించి ‘ఆపరేషన్’లలో పాల్గొన్నారు. దంతేవాడలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘దంతేశ్వరి ఫైటర్స్’ (మహిళా కమాండోలు) కు నాయకత్వం వహించారు. వాటికంటే కష్టమైన పని.. కరోనా లాక్డౌన్ నిబంధనల్ని జనం ఉల్లంఘించకుండా చూడటం అని ఇప్పుడామె గ్రహించే ఉంటారు. ‘‘నేను బయట ఉంటేనే.. వాళ్ల లోపల ఉంటారు’’ రోడ్డు మీద వెళుతూ అధాటున చూసిన వారికి మామూలు దుస్తుల్లో ఉన్న శిల్పా సాహు మొదట సాధారణ మహిళగా అనిపించవచ్చు. కానీ, గర్జించే ఆమె స్వరం.. ఆమె పోలీసు అన్న వాస్తవాన్ని ఆ వెంటనే తెలియజేస్తుంది. ‘వాపస్ జావో, ఘర్ జావో’ (వెనక్కు వెళ్లు.. ఇంటికి వెళ్లు) అని గట్టిగా అరచి చెప్పినా వినని వారికి ఆమె చేతిలోని లాఠీ చక్కగా అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్ధమౌతుంది. ఏప్రిల్ 18 నుంచి దంతెవాడ జిల్లా (దక్షిణ బస్తర్) లాక్డౌన్లో ఉంది. ఆ రోజు నుంచీ శిల్ప లాక్డౌన్ డ్యూటీలో ఉన్నారు. ‘‘గర్భిణిగా ఉండి మీరు బయటికి రావడం ఎందుకు?’’ అనే ప్రశ్నకు.. ‘‘నేను బయట ఉంటేనే వాళ్లు లోపల ఉంటారు’’ అంటున్నారు శిల్ప. -
ఛత్తీస్‌లో మావోల ఘాతుకం.. ఎమ్మెల్యే మృతి
-
ఛత్తీస్‌లో మావోల ఘాతుకం
సాక్షి, కొత్తగూడెం/రాయ్‌పూర్/బస్తర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవికి చెందిన కాన్వాయ్ లక్ష్యంగా మంగళవారం ఐఈడీ పేల్చారు. వెంటనే చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే మాండవి(40)తో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుశ్చర్యపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ అప్రమత్తతతో వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని ఆదేశించింది. ఐఈడీ పేల్చి.. కాల్పులు జరుపుతూ చివరి రోజు ఎన్నికల ప్రచారం ముగించుకున్న భీమా మాండవి దంతెవాడ జిల్లాలోని కువాకొండా నుంచి బచేలీకి బయలుదేరారు. వీరి కాన్వాయ్ శ్యామలగిరిలోని ‘నకుల్నార్’ ప్రాంతానికి రాగానే అక్కడే మాటేసిన మావోలు మందుపాతరను పేల్చారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాలు తుక్కుతుక్కయ్యాయి. జవాన్ల శరీర భాగాలన్నీ తెగిపడి ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఐఈడీ దాడి నుంచి తేరుకునేలోపే మావోయిస్టులు అన్నివైపుల నుంచి చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరుపుతూ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందజేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. అనంతరం కూంబింగ్ ప్రారంభించాయి. ఈ దుర్ఘటనలో చనిపోయిన జవాన్లను డ్రైవర్ దంతేశ్వర్ మౌర్య, ఛగ్గన్ కుల్దీప్, సోమ్డు కవాసీ, రామ్‌లాల్ ఒయామీగా అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్ని బహిష్కరించాలని మావోలు ఇటీవల పిలుపునిచ్చారు. మరోవైపు దంతెవాడ దాడి నేపథ్యంలో భద్రాచలం డిపో నుంచి వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేశారు. ముందుగానే హెచ్చరించాం: ఎస్పీ కువాకొండ మార్గంలో రాకపోకలు వద్దని తాము హెచ్చరించినా మాండవి వినిపించుకోలేదని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. తమ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఆయన గత రెండ్రోజులుగా ఇదే మార్గంలో రాకపోకలు సాగించారని వ్యాఖ్యానించారు. ‘ఈ మార్గమంతా మావోయిస్టులు ల్యాండ్మైన్లను అమర్చారు. మాండవి ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో సోమవారం కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఎమ్మెల్యే మాండవి కదలికలతో అప్రమత్తమైన మావోయిస్టులు సోమవారం రాత్రి ఐఈడీలను అమర్చి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బస్తర్ డివిజిన్‌లోని 12 స్థానాలకు గానూ 11 సీట్లను కాంగ్రెస్ దక్కించుకోగా, ఒక్క దంతెవాడలో మాత్రం మాండవి గెలుపొందారు. ఎన్నికలు ఆగవు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ లోక్‌సభ స్థానానికి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11నే ఎన్నికలు జరుగుతాయని ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రధానాధికారి సుబ్రత్ చెప్పారు. దాడి అనంతరం తొలి, రెండో విడత పోలింగ్ జరిగే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 11, 18, 23న 3 విడతల్లో ఎన్నికల నిర్వహణ కోసం 80,000 మంది భద్రతాబలగాలతో పాటు డ్రోన్లను ఛత్తీస్‌గఢ్‌లో మోహరించారు. మరోవైపు రాయ్‌పూర్‌లో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం భూపేశ్ బాఘేల్.. మావోలకు వారికి అర్థమయ్యే భాషలోనే బుద్ధి చెప్పాలని ఆదేశించారు. -
కిడ్నాపైన ఎస్ఐ దారుణ హత్య..!
రాయ్‌పూర్ : దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. అరన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల రేవలి గ్రామంలో ఆదివారం ఇద్దరు వ్యక్తుల్ని కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరు ఎస్ఐ కాగా, మరొకరు స్కూల్ టీచర్. దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవా వివరాల ప్రకారం.. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కశ్యప్‌ను సీఆర్పీఎఫ్ బెటాలియన్‌తో సమన్వయం చేస్తూ అరన్‌పూర్‌కు బదిలీ చేశారు. అక్కడే ఉన్న తన మిత్రుడు జైసింగ్ కురేటిని కలిసేందుకు కశ్యప్ వెళ్లాడు. సమాచారం అందుకున్న మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆ గ్రామంలోకి చొరబడ్డారు. కశ్యప్, జైసింగ్‌లను కిడ్నాప్ చేశారు. వారి ఆచూకీ కోసం ఆ ప్రాంతమంతా కూంబింగ్ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. సున్నిత ప్రాంతమైన రేవలి, అరన్పూర్ గ్రామాలు రాయపూర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కాగా, మావోయిస్టుల చేతిలో కిడ్నాపైన ఇద్దరిలో ఎస్ఐ లలిత్ కశ్యప్‌ను దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఐని హత్య చేసిన మావోయిస్టులు అతని మృతదేహం వద్ద ఓ లేఖను వదిలివెళ్లారు. స్కూల్ టీచర్ మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. (చదవండి : భారీ ఎన్కౌంటర్ : 8మంది మావోయిస్టులు మృతి) -
దంతెవాడలో మావోయిస్టుల దాడి
మావోయిస్టులు పంజా విసిరారు. ఎన్ఎండీసీ గనిపై దాడికి తెగబడ్డారు. గని వద్ద ఉన్న పొక్లెయిన్‌ను మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బైలదిల్లా గనుల్లో గురువారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు హుటాహుటిన తరలివెళ్లాయి. మావోయిస్టులకు, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.