
భోపాల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు అనుకూలంగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన మద్దతు ర్యాలీ హింసాత్మకంగా మారింది. నిరసనకారులను అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రియావర్మపై బీజేపీ కార్యకర్తలు అసభ్యకరంగా ప్రవర్తించారు. విధుల్లో భాగంగా ఆందోళనకారులను చెదరగొడుతున్న ఆమెను అడ్డుకుని జుట్టుపట్టి లాగారా. మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌గఢ్ జిల్లా ప్రధాన రహదారిపై సీఏఏకు మద్దతుగా ఆదివారం బీజేపీకి కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అయితే దీనికి ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకారులు-పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. విషయం తెలిసుకున్న డిప్యూటీ కలెక్టర్ ప్రియావర్మ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
పలువురు ఆందోళకారులను పట్టుకుని పోలీసు వ్యానులో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వెనుకనుంచి వచ్చి ఆమె జుట్టుపట్టి లాగి దాడిచేసే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న రక్షణ సిబ్బంది కలెక్టర్‌ను చుట్టుముట్టి కాపాడారు. అయితే కొద్దిసేపటి తరువాత ఆ పోకిరిని గుర్తించిన పాలానాధికారి.. కాలర్‌పట్టి గుంజి చెంప చెల్లుమనిపించారు. విధుల్లో ఉన్న మహిళా అధికారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తావా అంటూ తీవ్ర ఆగ్రహం చేశారు. అనంతరం ఘటనకు సంబంధించిన ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే దీనికి సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై తీవ్రంగా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment