సాక్షి, న్యూఢిల్లీ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని రావణుడిగా, ఆయన సోదరి, యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని శూర్పణఖగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీని మునిగిపోయే నావగా పోల్చుతూ ఎస్సీ, ఎస్టీ చట్టం వివాదం కారణంగానే రాజస్ధాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించగలిగిందని వ్యాఖ్యానించారు. ఓ రాజకీయ విధానమంటూ లేని కాంగ్రెస్ దేశంలో ఏ ఎన్నికల్లోనూ గెలవబోదని ఆయన జోస్యం చెప్పారు.
రాముడు రావణుడిపై యుద్ధం చేపట్టే ముందు రాముడిని ఎదుర్కొనేందుకు తొలుత రావణుడు తన సోదరి శూర్పణఖను పంపాడని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ రాముడైన నరేంద్ర మోదీని ఓడించేందుకు రాహుల్ తన సోదరి శూర్పణఖ(ప్రియాంక)ను మోదీని ఎదుర్కొనేందుకు బరిలో నిలిపారని సురేంద్ర సింగ్ అన్నారు.
మరోవైపు మాయావతిని ట్రాన్స్‌జెండర్ కన్నా హీనమని తమ పార్టీ ఎమ్మెల్యే సాధనా సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించడం గమనార్హం. ఆత్మగౌరవం లేని వారెవరినైనా ట్రాన్స్‌జెండర్ అంటారని గతంలో తనను అవమానించిన ఎస్పీతో జట్టు కట్టడం ద్వారా మాయావతి తనకు ఆత్మగౌరవం లేదని నిరూపించుకున్నారని అన్నారు. కాగా సాక్షాత్తూ రాముడు దిగివచ్చినా అత్యాచారాలు ఆపలేడని గత ఏడాదిలో సైతం బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment