సంభల్‌ ఉద్రిక్తతలు.. తిరిగి ఢిల్లీ ప్రయాణమైన రాహుల్‌, ప్రియాంక | Rahul Priyanka Gandhi Sambhal Visit Updates UP Cops Ready To Stop Them | Sakshi
Sakshi News home page

సంభల్‌ ఉద్రిక్తతలు.. ఘాజీపూర్‌లో రాహుల్‌, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు

Published Wed, Dec 4 2024 11:14 AM | Last Updated on Wed, Dec 4 2024 4:01 PM

Rahul Priyanka Gandhi Sambhal Visit Updates UP Cops Ready To Stop Them

పోలీసుల తీరుపై  రాహుల్‌ గాంధీ  తీవ్ర అసహనం 

  • ‘మేం సంభల్‌ వెళ్లేందుకు పోలీసులు మమ్మల్ని అనుమతించట్లేదు. అడ్డుకుంటున్నారు. 
  • లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లే హక్కు నాకు ఉంది. 
  • ఇతర నేతలతో కాకుండా ఒంటరిగా వెళ్లేందుకూ నేను సిద్ధమే. పోలీసులతో కలిసి వెళ్లేందుకైనా సిద్ధమే. కానీ, వారు అందుకు అంగీకరించడం లేదు
  •  ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు.
  • అటు వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘‘బాధితులను కలిసే హక్కు రాహుల్‌కు ఉంది. ఆయనను అనుమతించాలి’’ అని డిమాండ్‌ చేశారు.
  •  అయినా, పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో చేసేదేం లేక.. కాంగ్రెస్‌ నేతలు అక్కడినుంచి వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు.

 

  • ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన రాహుల్‌​ ప్రియాంక
  • దాదాపు 2 గంటల తర్వాత ఢిల్లీకి పయనమైన నేతలు
  • సంభల్‌ సందర్శనకు అనుమతి లేదని అడ్డకున్న పోలీసులు

 

  • ఘాజీపూర్‌ సరిహద్దుకు చేరుకున్న ప్రియాంక, రాహుల్‌
  • ఘాజీపూర్‌లో వీరి కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.
  • ఢిల్లీ టు సంభల్‌ మార్గంలో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు
  • ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌
  • ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
     

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌ అల్లర్ల ప్రాంతాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా బయలుదేరారు. సంభాల్‌లోని మసీదులో సర్వే కారణంగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించనున్నారు. రాహుల్‌, ప్రియాంక వెంట ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ప్రతినిధి బృందం కూడా ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని  10 జనపథ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

 ఢిల్లీ నలుమూలలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ–సంభల్‌ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఢిల్లీ–మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘాజీపూర్‌ సరిహద్దులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

అయితే సంభల్‌లో  శాంతిభద్రతల దెబ్బతిన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆ ప్రాంతానికి చేరుకోకుండా ఆడ్డుకునే అవకాశం ఉంది. శాంతిభద్రతల పరిస్థితి కారణంగా బయటి వ్యక్తులను ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతించబోమని పోలీసులు, జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇటీవల సమాజ్ వాదీ పార్టీ ఎంపీల ప్రతినిధి బృందం జిల్లాలోకి ప్రవేశించకుండా నిలిపివేశారు. ఇక నిషేధాజ్ఞలను డిసెంబర్ 31 వరకు పొడిగించారు.

జిల్లా  కలెక్టర్‌ రాజేంద్ర పెన్సియా గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్ పోలీసు కమీషనర్‌లకు.. అమ్రోహా, బులంద్‌షహర్ పోలీసు సూపరింటెండెంట్‌లకు లేఖ రాశారు.  రాహుల్‌ సోనియా గాంధీలను ఆపాలని లేఖలో  కోరారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మాట్లాడుతూ.. కనీసం నలుగురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని సంభాల్‌కు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

కాగా సంభల్‌లోని షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో దేవాలయం కొందని కొందరు  హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సర్వే జరుగుతోన్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, పోలీసులపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. 

పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పంటించారు. ఆ ఘర్షణల్లో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సంభల్‌లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు స్థానిక సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్, మరో 700 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement