UP BJP MLA Rajesh Misra's Daughter Scares for Life After Marrying a Dalit, Releases a Video in Social Media - Sakshi
Sakshi News home page

మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు : ఎమ్మెల్యే కూతురు

Published Thu, Jul 11 2019 10:21 AM | Last Updated on Thu, Jul 11 2019 12:53 PM

UP BJP MLA Daughter Sensational Allegations On Him Who Married Dalit - Sakshi

లక్నో : ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. తమకు ఇష్టం లేని వాళ్లను పెళ్లి చేసుకున్న పిల్లలపై కన్న తల్లిదండ్రులే కత్తులు దూస్తున్న సంఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యేపై స్వయానా ఆయన కూతురు ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దళితుడిని పెళ్లి చేసుకున్న కారణంగా తనను, తన భర్తను చంపేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్‌ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా తీవ్ర ఆరోపణలు చేశారు. తండ్రి నుంచి తమను కాపాడాలంటూ పోలీసులకు విఙ్ఞప్తి చేశారు.

వివరాలు... ఉత్తరప్రదేశ్‌లోని బిథారి చేన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజేశ్‌ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా(23) అజితేశ్‌ కుమార్‌(29) అనే వ్యక్తిని ప్రేమించారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి అతడిని వివాహం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి తండ్రి తమను వేధింపులకు గురిచేస్తున్నారని సాక్షి మిశ్రా ఆరోపిస్తున్నారు. తండ్రి దగ్గర పనిచేసే కొంతమంది గూండాలు తమను నిరంతరం వెంబడిస్తున్నారని..వారిని ఇలాగే వదిలేస్తే తమను చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు...‘ నా ఇష్ట పూర్వకంగా అజిత్‌ను పెళ్లి చేసుకున్నాను. ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. కానీ మా నాన్నకు ఇది అర్థం కావడం లేదు. అందుకే రోజూ తన గూండాలను పంపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. ఇప్పటికే చాలా అలసిపోయాను. ఒకవేళ వాళ్ల చేతికి దొరికితే మమ్మల్ని కచ్చితంగా చంపేస్తారు. దయచేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరుతున్నాను’ అని సాక్షి మిశ్రా బుధవారం సోషల్‌ మీడియాలో వీడియో అప్‌లోడ్‌ చేశారు.

నేను దళితుడిని...
సాక్షి మిశ్రా భర్త అజితేశ్‌ మాట్లాడుతూ..‘ నేను ఒక దళితుడిని. మమ్మల్ని చంపేదాకా వాళ్లు వదలరు. ఈరోజు కూడా ఎమ్మెల్యే మనుషులు మా వెంట పడ్డారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాం. దయచేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీని కోరుతున్నాం’ అని వీడియోలో పేర్కొన్నారు. అదే విధంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజేశ్‌ మిశ్రాకు సహకరించవద్దని విఙ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన డీఐజీ దంపతులకు తప్పకుండా రక్షణ కల్పిస్తామని.. అంతకంటే ముందు వారి ఆచూకీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement