జైపూర్ : తాము రాముడి కుమారుడు కుశుడి వంశానికి చెందిన వారమని బీజేపీ ఎంపీ, జైపూర్ రాజకుమారి దియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడి వంశస్థులు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నారని.. అయోధ్య వివాదం తొందరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం దియా కుమారి మాట్లాడుతూ... ‘రాముడి వారసులు ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. అంతెందుకు మా కుటుంబం కుశుడి అంశ నుంచి ఉద్భవించింది. రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను. కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను కూడా. దాదాపు ప్రతీ ఒక్కరు రాముడి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అయోధ్య కేసులో త్వరగా తీర్పు వెలువరించాల్సిందిగా వారందరి తరఫున విన్నపం చేస్తున్నా’ అని పేర్కొన్నారు.
కాగా అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని రామ్‌లల్లా విరాజ్‌మాన్ తరఫు న్యాయవాది పరాశరన్ వాదించారు. ఇందుకు స్పందనగా సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం...‘ ‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్నవ్యక్తిగా ఎలా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించడంతో..‘ కేదర్‌నాథ్ ఆలయాన్నే తీసుకుంటే, అక్కడ ఎలాంటి విగ్రహం లేకపోయినా ప్రజలు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కేసులో జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్న వ్యక్తిగా పరిగణించవచ్చు’ అని పరాశరన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment