
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా విజయ్ మాల్యా, నీరవ్ మోదీలా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆర్థిక మంత్రి హోదాలో చిదంబరం గాంధీ కుటుంబానికి సహకరించారని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు.దర్యాప్తు సంస్థలకు సహకరించని చిదంబరం దేశం నుంచి పారిపోయిన పారిశ్రామికవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీల తరహాలో వ్యవహరిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు.
అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ మోదీ ప్రభుత్వం విడిచిపెట్టదని హెచ్చరించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కోరుతూ చిదంబరం చేసిన అప్పీల్‌ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చిన నేపథ్యంలో జీవీఎల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రధాన న్యాయమూర్తి ఎదుట పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు చిదంబరం న్యాయవాదులకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment