దాదాపు మూడు దశాబ్దాలపాటు జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ప్రధాన కార్యాలయంగా కొనసాగిన నగరంలోని రేస్‌కోర్స్ రోడ్డులోని భవనంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం అడుగుపెట్టి భయభ్రాంతులకు గురయ్యార ట.
బెంగళూరు: దాదాపు మూడు దశాబ్దాలపాటు జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ప్రధాన కార్యాలయంగా కొనసాగిన నగరంలోని రేస్‌కోర్స్ రోడ్డులోని భవనంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం అడుగుపెట్టి భయభ్రాంతులకు గురయ్యార ట. భవనం ప్రాంగణంలో రక్తం లాంటి రంగు, నిమ్మకాయలు, ఎండు మిరపకాయల, ఇతర వస్తువులను చూసి వారు హడలిపోయారట. జేడీ (ఎస్) పార్టీ కార్యకర్తలు భవనాన్ని ఖాళీచేసి పోతూ...భూత ప్రేత పిశాచాలకు తాంత్రిక పూజలు చేశారన్నది వారి భయం. అంతకుముందు ఆదివారం నాడే జేడీ (ఎస్) ఈ భవనాన్ని ఖాళీ చేసింది. తమ పార్టీని చీకటి శక్తులు పీడించి పాడు చేయాలనే వారు అలా చేసి ఉంటారని భావిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ‘శుద్ధి’ కార్యక్రమం కోసం పేరున్న పండితుల కోసం తిరుగుతున్నారు. అయితే తాంత్రిక పూజా వార్తలను జేడీ (ఎస్) హెచ్‌డీ దేవెగౌడ ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ భవనాన్ని జేడీ (ఎస్) నుంచి స్వాధీనం చేసుకోవడానికి కాంగ్రెస్ సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన విషయం తెల్సిందే. ఈ భవనం కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని గతంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 2014, జనవరి నెలలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఏడాదిలోగా భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకే గత ఆదివారం నాడు జేడీ (ఎస్) ఈ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.
కర్ణాటక రాజకీయాల్లో లక్కీ నెంబర్లు, వాస్తు అంశాలతోపాటు భూత ప్రేత పిశాచాలను పిలిచి శత్రువులపై ప్రయోగించడానికి తాంత్రిక పూజలు చేయడం కూడా కొత్తేమి కాదు. కర్ణాటక రాజకీయ నాయకులు, సీఎం పదవులు చేపట్టిన వారు చీకటి శక్తులను వశం చేసుకోవడానికి తాంత్రిక పూజలు చేసేవారని రాజకీయ చరిత్రకారుడు ఏ వీరప్ప తెలియజేశారు. యెడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తన ప్రాణాలకు ముప్పుందని, తన చావుకోరుతూ జేడీఎస్ క్షుద్ర పూజలు చేసిందని ఆరోపించారు కూడా. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజున కూడా దుష్ట శక్తులను దూరం తరిమేందుకు ‘నర్సింహ కవచ, గార్దబ ప్రయోగ, మనుష్యుక్త పారాయణ’ తదితర పూజాది కార్యక్రమాలు, హోమాలు నిర్వహించారని ప్రచారంలో ఉంది. హెచ్‌డీ దేవెగౌడ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి రేవన్న తన రాజకీయ జీవితంలో గాడిదలు బలి ఇస్తూ తాంత్రిక పూజలు ఎక్కువ చేసేవారన్నది ప్రచారంలో ఉంది. ఆయన అలాంటి పూజలు చేస్తూ మీడియా కెమేరాలకు కూడా చిక్కారు.