
అండమాన్‌లో పడవ మునక
అండమాన్ తీరం వద్ద పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ ఆదివారం ప్రమాదవశాత్తు బంగాళాఖాతంలో మునిగిపోయింది.
21 మంది పర్యాటకులు మృతి... ఇద్దరు గల్లంతు
పోర్ట్‌బ్లెయిర్: అండమాన్ తీరం వద్ద పర్యాటకులతో ప్రయాణిస్తున్న పడవ ఆదివారం ప్రమాదవశాత్తు బంగాళాఖాతంలో మునిగిపోయింది. రోస్ దీవి నుంచి ఉత్తర అఖాతం వైపు ప్రయాణిస్తుండగా సాయంత్రం సుమారు 4 గంటలకు జరిగిన ఈ దుస్సంఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పడవలో మొత్తం 45 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, 23 మందిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడగలిగాయని, ఇద్దరు గల్లంతయ్యారని దక్షిణ అండమాన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పి.జోహార్ చెప్పారు. కోస్ట్‌గార్డ్ బృందాలు, స్థానిక సహాయక బృందాలు మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ పడవలో ప్రయాణిస్తున్న వారంతా తమిళనాడులోని కాంచీపురం జిల్లా, ముంబైలకు చెందిన పర్యాటకులేనని అధికారులు చెప్పారు. జరిగిన ప్రమాదం, సహాయక చర్యల వివరాలు...
‘అక్వామెరైన్’ అనే ఈ పడవలో 25 మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుండగా, మితిమీరిన సంఖ్యలో ప్రయాణికులను ఓవర్‌లోడ్ చేసిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం.
హా కొందరు ప్రయాణికులు పడవ క్యాబిన్‌లో చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
హా మృతుల కుటుంబాలకు అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సింగ్ లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
జరిగిన సంఘటనపై ఆయన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో మాట్లాడి, సహాయక కార్యక్రమాలను వివరించారు.
ఈ ప్రమాదంపై ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన కేంద్ర సంస్థలను ఆదేశించారు.
సహాయక బృందాలు ప్రాణాలతో కాపాడిన వారిని పోర్ట్‌బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆస్పత్రిలో చేర్చారు.