సరిహద్దుల్లో భయం భయం..
• బిక్కుబిక్కుమంటున్న గ్రామస్తులు
• పాక్‌నుంచి నిరంతరాయంగా దాడులు
• సరిపోని బంకర్లు.. రక్షణ లేని ఇళ్లు
సాక్షి నేషనల్ డెస్క్ : భారత సర్జికల్ దాడుల తర్వాత పాక్ చేస్తున్న దాడుల్లో సరిహద్దు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాణాలు కోల్పోవటంతోపాటు.. పలు సందర్భాల్లో తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఇళ్లలోనుంచి బయటకు రాలేక.. ఇళ్లలోనూ ఉండలేక బిక్కుబిక్కుమంటున్నారు. ఉడీ, పూంచ్, రాజౌరీ, నౌషేరా, ఆర్‌ఎస్ పుర సెక్టార్లలో పరిస్థితిదారుణంగా ఉంది. ఇప్పటికే చాలా మంది గ్రామస్తులు పాక్ దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వదిలి వెళ్లలేక చాలా మంది గ్రామాల్లో ఉంటూ నరకం అనుభవిస్తున్నారు. గ్రామస్తులకు రక్షణ కల్పించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమ్యూనిటీ బంకర్లను నిర్మిస్తున్నాయి. కానీ ఇవి సరిపోవటం లేదు.
‘ఒక్కో గ్రామంలో 400-500 మంది ఉంటారు. ఒక్కో బంకర్‌ల్లో 25-30 మందే పడతారు మరి మిగిలినవారి సంగతేంటి?’ అని అశోక్ అనే గ్రామస్తుడుప్రశ్నించాడు. చాలా మంది ఇళ్లలోనే ఉంటూ మోర్టార్ల దాడిలో గాయపడుతున్నారు. మిగిలిన వాళ్లు తట్టా, బుట్టా సర్దుకుని గొడ్డు, గోదాతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. దీంతో చాలా ఊళ్లు ఖాళీ అయ్యాయి. రమేశ్ లాల్ (45) అనేవ్యక్తి పాక్ దాడుల్లో తన సోదరుణ్ని కోల్పోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తండ్రికి చికిత్స చేయిస్తే.. రూ. 3 లక్షలు ఖర్చయింది. కానీ ప్రభుత్వం తీవ్రంగా గాయపడిన వారికి రూ.75వేలు మాత్రమే ఇచ్చింది. సరిహద్దుల్లో బతకటమే కష్టమనుకునే పరిస్థితుల్లో ఇంత మొత్తాన్ని ఎలా భరించాలనేది రమేశ్ ఆవేదన.
దీపావళి అంటే తెలీదు‘: దేశమంతా దీపావళి జరుపుకుంటోంది. కానీ సరిహద్దుల్లోగస్తీ సైనికులకు పండగ లేదం’టూ లతామంగేష్కర్ పాడిన గీతం చాలా ఫేమస్. కానీ సైనికులకే కాదు. వారి బూట్ల చప్పుళ్లతో అప్రమత్తంగా ఉండే సరిహద్దు గ్రామాలకూ దీపావళి లేదు. టపాసులు పేలిస్తే.. ఆ వెలుతురు ఆధారంగా పాక్ దాడులు చేస్తుందని.. దశాబ్దాలుగా వీళ్లు పండగ జరుపుకోలేదు. అలాంటిది ఇప్పుడు, రేయింబవళ్లు. గ్రామాల్లో కాల్పుల మోత మోగుతోందని గ్రామస్తులు అంటున్నారు.