బ్రహ్మోస్ సక్సెస్..
న్యూఢిల్లీ: యుద్ధనౌకలను తుత్తునియలు చేసే బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణిని భారత్ సోమవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. 290 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఇది గురి తప్పకుండా చేధించగలదు. ప్రయోగం సందర్భంగా బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత ప్రమాణాలను విజయవంతంగా సాధించినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని కార్వార్ తీరంలో యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోల్‌కతా నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. మజ్‌గావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌకను ఇంకా నౌకాదళంలో ప్రవేశపెట్టలేదు. కదన రంగంలోకి దిగితే ఒకేసారి 16 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించగలిగే సత్తా ఐఎన్‌ఎస్ కోల్‌కతా సొంతం.
ఐఎన్‌ఎస్ కోల్‌కతా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ తరహా యుద్ధనౌకలలో మొదటిది.విసృ్తత పరీక్షల అనంతరం వచ్చే జూలైలో దీన్ని నౌకాదళంలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.రష్యా తయారీ తల్వార్ యుద్ధనౌకలు సహా పలు యుద్ధనౌకలలో బ్రహ్మోస్ క్షిపణి విధ్వంసక వ్యవస్థలను ప్రవేశపెట్టారు.సైనిక, వైమానిక దళాలలో బ్రహ్మోస్ క్షిపణులను ఇప్పటికే చేర్చారు.సు-30 ఎంకేఐ యుద్ధవిమానాల నుంచి కూడా బ్రహ్మోస్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనిక దళాలకు బ్రహ్మోస్ క్షిపణులను అందచేశారు.భారత్-రష్యాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ విభిన్న యుద్ధతంత్రాల కోసం పలు రకాల క్షిపణులను రూపొందించింది. మెరుపు వేగంతో దాడులు చేసే హైపర్ సోనిక్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.