రాజ్‌కోట్ : కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. వాళ్లు ఊరికనే అనలేదు.. అని నిరూపించింది ఓ శునకం. ఏకంగా సింహాలకే ఎదురు నిలిచి తన యజమానిని ఓ శునకం కాపాడింది. ఈ
సంఘటన గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా సవెర్కుండ్ల తాలుకా అంబార్డి గ్రామంలో చోటు చేసుకుంది. గొర్రెల కాపరి భవేశ్ హమిర్ భర్వాద్(25) రోజూలానే మేకలు, గొర్రెలను గడ్డి కోసం ఊరి చివరకు తీసుకెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మూడు సింహాలు మేకలు, గొర్రెల మందపై దాడికి దిగాయి. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్పరిణామానికి ఏం చేయాలో తెలియక, మేకలను రక్షించడానికి సింహాలను అక్కడి నుంచి తరమాలని ప్రయత్నించాడు భవేశ్.
వాటిని అక్కడి నుంచి పోయేలా ప్రయత్నం చేయడంతో సింహాలకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఓ సింహం భవేశ్‌పై పంజావిసరడానికి ప్రయత్నించగా అతను తృటిలో తప్పించుకున్నాడు. అంతలోనే అతని పెంపుడు కుక్క క్షణాల్లో అక్కడికి చేరింది. తన యజమానికి సింహానికి అడ్డుగా నిలుచుని అరవడం ప్రారంభించింది. కుక్క అరుపులు విని పెద్ద మొత్తంలో జనం రావడంతో సింహాలు అక్కడి నుంచి జారుకున్నాయి. సింహాల దాడిలో భవేశ్‌కు స్వల్పగాయాలవ్వగా, మూడు మేకలు మృతిచెందాయి. కుక్క అడ్డుగా రాకపోతే సింహం దాడిలో భవేశ్ మృతిచెంది ఉండే వాడని, కుక్క చూపించిన తెగువను గ్రామస్తులు అభినందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సింహాల దాడి సంఘటనపై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment