
టీ తాగుతుండగా దాడి.. 27కత్తిపోట్లు
ముంబయి: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండుమంది కత్తులతో వీర విహారం చేశారు. పట్టపగలే ఓ వ్యక్తిపై అతిదారుణంగా దాడి చేశారు. 27సార్లు ఆ వ్యక్తిని కర్కశంగా నరికి చంపారు. మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రఫికుద్దీన్ అనే వ్యక్తి స్థానికంగా నేరాలు చేస్తుండేవాడు.
అతడు ధులేలో రోడ్డు పక్కన టీ తాగుతుండగా ఒకేసారి పదకొండు మంది కత్తులు, కర్రలు, తుపాకీతో వచ్చి దాడికి దిగారు. తొలుత కర్రలతో కొట్టి అనంతరం కత్తులతో 27 వేట్లు వేశారు. అనంతరం తుపాకీతో అతడి తలపై కాల్పులు జరిపి దారుణంగా చంపేశారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత స్కూటర్లు, బైక్‌లపై పారిపోయారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగే సమయంలో వర్షం కూడా వస్తుండటంతో రక్తంపారి ఆ ప్రాంతమంతా భీతావాహంగా కనిపించింది. హత్యకు గురైన వ్యక్తిపై 30 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు.