
పార్లమెంటులో ‘ధరల’ రగడ
* లోక్‌సభలో ఓటింగ్‌తో కూడిన చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
* కుదరదన్న స్పీకర్; వెల్‌లో నిరసనలో రాహుల్
* పలుమార్లు వాయిదా పడిన లోక్‌సభ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజే అధికార, విపక్షాల మధ్య యుద్ధం మొదలైంది. ధరల పెరుగుదల ప్రధానాస్త్రంగా విపక్షం.. అది యూపీఏ పాలనాఫలితమేనంటూ అధికార పక్షం.. ఉభయసభల్లోనూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి.
లోక్‌సభలో: సోమవారం సభ ప్రారంభం కాగానే లోక్‌సభ సభ్యుడు హర్భజన్ లాఖా మృతికి సంతాపం ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా నగరం దుర్ఘటనలో.. చెన్నైలో, ఢిల్లీలో భవనం కూలిన ఘటనల్లో.. మృతిచెందిన వారికి సభ సంతాపం తెలిపింది. పీఎస్‌ఎల్‌వీ-సీ23 ప్రయోగంలో విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో విజేతగా నిలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్, బిలియర్డ్స్, స్నూకర్స్‌లో అంతర్జాతీయ విజయాలు సాధించిన పంకజ్‌అద్వానీ, ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ నంబర్ 1గా నిలిచిన జితూరాయ్‌లను స్పీకర్ అభినందించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించగా.. కాంగ్రెస్, టీఎంసీ, ఆర్‌జేడీ, ఎస్‌పీ, ఆప్, వామపక్షాల సభ్యులు ఆహార ధరల పెరుగుదల, రైలు చార్జీల పెంపు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై వాయిదా తీర్మానం కింద చర్చకు పట్టుపడుతూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ధరల పెరుగుదల అంశంపై తాము కూడా ఆందోళన చెందుతున్నామని.. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఏ నిబంధన కింద ఈ చర్చ జరగాలనేది స్పీకర్ నిర్ణయించాలని చెప్పారు.
దాంతో ఓటింగ్‌తో కూడిన వాయిదా తీర్మానాల కింద చర్చ చేపట్టాలంటూ ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్.. ఓటింగ్‌కు అవకాశం లేని 193 నిబంధన కింద చర్చ చేపట్టేందుకు ఇచ్చిన నోటీసులను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. కానీ.. విపక్షాలు వాయిదా తీర్మానం కిందే చర్చను చేపట్టాలని పట్టుపట్టాయి. స్పీకర్ అంగీకరించకపోవటంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ రెండు పర్యాయాలు సభ వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక కాంగ్రెస్ ఉపనాయకుడు అమరీందర్‌సింగ్ మాట్లాడుతూ.. ధరల పెరుగుదల చాలా ముఖ్యమైన అంశం కాబట్టి దీనిపై ఓటింగ్ నిర్వహించాలని పట్టుపట్టారు. ఇదే అంశంపై రాజ్యసభలో చర్చకు అనుమతించారని కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్యసింథియా పేర్కొనగా.. ఆ సభలోని అంశాలను లోక్‌సభలో చర్చించరాదని స్పీకర్ వారించారు. ఈ సందర్భంగా గందరగోళం తలెత్తింది. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో స్పీకర్ పది నిమిషాల్లోనే సభను మంగళవారానికి వాయిదావేశారు.
వెల్ వద్ద రాహుల్
లోక్‌సభలో సోమవారం నాడు అరుదైన దృశ్యం కనిపించింది. సమావేశాల్లో సాధారణంగా వెనుక బెంచీల్లో కూర్చునే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ..ధరల పెరుగుదలపై విపక్షాల సభ్యులు చర్చకు పట్టుపడుతూ ఆందోళనకు దిగగా.. రాహుల్ కూడా పార్టీ సహచరులతో కలిసి వెల్ పక్కన నిల్చుని నిరసన తెలిపారు. అక్కడ ఎన్‌సీపీ సభ్యురాలు సుప్రియాసూలే, తృణమూల్ నేత సౌగతారాయ్‌లతో రాహుల్ మాట్లాడటం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కూడా వెల్‌లోకి దూసుకెళ్లి పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఎల్‌కె అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్‌లు సమావేశం చివరివరకూ సభలోనే ఉన్నారు.
రాజ్యసభలోనూ: ధరల పెరుగుదల అంశం పెద్దల సభనూ కుదిపేసింది. విపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చించాలని పట్టుబడ్డారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ధరలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనడంతో చైర్మన్ అన్సారీ చర్చకు అవకాశం కల్పించారు. చర్చను రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ ప్రారంభించారు. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్డీయే ప్రభుత్వం అనుసరించిన విధానాలు ద్రవ్యోల్బణానికి ఊతమిచ్చేవిగానే ఉన్నాయని విమర్శించారు. రైలు చార్జీలు, పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ధరలను ఇష్టానుసారం పెంచేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కలగజేసుకుని.. ఇందుకు గత యూపీఏ ప్రభుత్వ విధానాలే కారణమని ఎదురుదాడికి దిగారు. సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి.. బీజేపీ నేతలు యూపీఏ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్నారా? అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. బీజేపీకి వ్యాపార, వాణిజ్య వర్గాలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. ‘మంచి రోజులు రాలేదు. ఖరీదైన రోజులొచ్చాయ’న్నారు.