గుండెపోటు వచ్చినా.. బస్సు డ్రైవర్ సాహసం
మధ్యప్రదేశ్‌లో ఓ బస్సు డ్రైవర్‌కు బస్సు నడుపుతుండగా మధ్యలో గుండెపోటు వచ్చింది.
ఆర్టీసీ బస్సులలో ప్రయాణం.. సురక్షితం అని ఎందుకు అంటారో చెప్పేందుకు ఇది మరో నిదర్శనం. మధ్యప్రదేశ్‌లో ఓ బస్సు డ్రైవర్‌కు బస్సు నడుపుతుండగా మధ్యలో గుండెపోటు వచ్చింది. అయినా.. చిట్టచివరి క్షణం వరకు బస్సును జాగ్రత్తగా నియంత్రిస్తూ దాన్ని ఆపాడు. ఆ తర్వాత స్టీరింగ్ వీల్ మీదే తలవాల్చి.. ఊపిరి వదిలేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో జరిగింది. ఆస్థా- సెహోర్ జాతీయ రహదారి మీద బస్సు వెళ్తుండగా బాబూలాల్‌కు గుండెపోటు వచ్చింది.
బాబూలాల్‌కు గుండెల్లో నొప్పి రాగానే ముందుగా బస్సును స్లో చేశాడు. తర్వాత ఒక పార్కు వద్దకు తీసుకెళ్లి.. అక్కడ బస్సును ఆపేశాడు. ఆపిన కొద్ది సెకన్లకే అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఏమైందో అర్థంకాని ప్రయాణికులు వెళ్లి చూడగా అప్పటికే అతడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. వెంటనే పోలీసులకు విషయం చెప్పి, అంబులెన్సును పిలిపించారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ బాబూలాల్ స్వస్థలం సాగర్ అని తెలిసింది.