
'వోల్వో బస్సు తయారీలో లోపం ఉండొచ్చు'
కర్ణాటకలో గురువారం ఉదయం సంభవించిన ఘోర బస్సు ప్రమాదంపై ఆ బస్సు యాజమాన్యం స్పందించింది. ప్రమాదానికి అతివేగం కారణం కాదని, బస్సు తయారీలో లోపం ఉండొచ్చని యజమాని వెల్లడించారు. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేరీ జిల్లాలోని కునిమల్లళ్లిలో ప్రమాదానికి గురైంది.
బస్సు డివైడర్ను డీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. వీరిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తం చేయడంలో కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగివుండేది.
అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి బెంగళూరులో వెల్లడించారు. ప్రమాదానికి గురైన సమయంలో బస్సు 140 -150 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపారు. హవేరి ప్రమాదం, ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్ జిల్లాలోని పాలెం వద్ద వోల్వో బస్సు అగ్ని ప్రమాదం ఘటనలు ఒకేలా ఉన్నాయని ఆయన చెప్పారు. మృతుల్లో ఒకరు ముంబైకి చెందిన శ్రీరాంగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరమే ప్రమాదం జరిగిన బస్సును కొనుగోలు చేశారని మంత్రి రామలింగారెడ్డి వివరించారు.
కర్నాటక హవేరిలో ఘోర బస్సు ప్రమాదం దృశ్యాలు..