
కోల్‌కతా హైకోర్టు జడ్జికి కోర్టు ధిక్కార నోటీసులు
• జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
• విధులు నిర్వర్తించరాదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తొలిసారిగా ఓ హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ధిక్కార నోటీసులు జారీ చేసింది. కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్‌ను వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు వ్యతిరేకంగా కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేగాక ఆయన్ను తక్షణం ఎలాంటి న్యాయపరమైన, పరిపాలన పరమైన విధులు చేపట్టకుండా నిరోధించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహార్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎం.బి.లోకూర్, జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఉన్నారు.
ఫిబ్రవరి 13న ఆయన కోర్టు ఎదుట హాజరు కావాలని ఉత్తర్వుల్లో ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఆయన స్వాధీనంలో ఉన్న అన్ని న్యాయపరమైన, పరిపాలనాపరమైన ఫైళ్లను కోల్‌కతా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు అందజేయాలని నిర్దేశించింది. అలాగే కోర్టు ఆదేశాల కాపీని జస్టిస్ కర్ణన్‌కు పంపించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను కోరింది. ఆయనకు వ్యతిరేకంగా సుమోటోగా కోర్టు ధిక్కార పిటిషన్ విచారణను ఫిబ్రవరి 13న చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ముకుల్ రోహ్‌తగి మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు అపకీర్తి తెచ్చేవిధంగా వ్యవహరించిన జస్టిస్ కర్ణన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
జస్టిస్ కర్ణన్‌కు ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్, జ్యుడీషియల్ పనులు అప్పగించరాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు కోరవచ్చని తెలిపారు. ఆయన మాటల్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. సిట్టింగ్ హైకోర్టు జడ్జికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారని పేర్కొంది. పలువురు న్యాయమూర్తులు, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ జస్టిస్ కర్ణన్.. సుప్రీంకోర్టు సీజేఐకి, ప్రధానికి, ఇతరులకు లేఖలు రాయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ధర్మాసనం ఈ నోటీసులు ఇచ్చింది.