ఒంటెలకూ ఓ పండుగ.. | camel festival in rajasthan | Sakshi
Sakshi News home page

ఒంటెలకూ ఓ పండుగ..

Published Fri, Jul 17 2015 2:09 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

camel festival in rajasthan

సాక్షి: ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను బట్టి పలు రకాల పండుగలు ప్రాచుర్యంలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలైన.. తెలంగాణలో బతుకమ్మ, ఆంధ్రాలో సంక్రాంతి పండుగలు ఆ కోవలోనివే. దీనికి కొంచెం భిన్నంగా రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో ప్రతి ఏటా ఒంటెల పండుగ జరుపుకుంటారు. దీన్నే ‘పశువుల సంత’ అని కూడా పిలుస్తారు. ఆ విశేషాలేమిటో మనమూ తెలుసుకుందామా..!

ప్రపంచంలోనే పెద్ద వేడుక..
రాజస్తాన్‌లో ఐదు రోజుల పాటు జరిగే ఒంటెల పండుగ ప్రపంచంలోని అతి పెద్ద ఒంటెల పండుగ, అతి పెద్ద పశువుల పండుగగా ప్రసిద్ధి చెందింది. కార్తీక మాసం(అక్టోబర్ - నవంబర్)లో పుష్కర్ సరస్సు ఒడ్డున జరిగే ఈ పండుగలో దాదాపు 2 లక్షల మందికి పైగా పాల్గొంటారని అంచనా. సుమారు 50,000కు పైగా ఒంటెలు ఈ వేడుకలో కనువిందు చేస్తాయి. పౌర్ణమి సమీపించే కొద్దీ పుష్కర్‌ను సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతుంది. పౌర్ణమి రోజు పుష్కర్‌లో స్నానమాచరిస్తే మంచిదని భక్తుల నమ్మకం.     

విదేశీ పర్యాటకుల సందడి..
పుష్కర్‌లో ఒంటెల సందడిని చూడడానికి దేశ, విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. సంప్రదాయక దుస్తులు ధరించి స్థానికులు చేసే హడావిడిని వీక్షించడానికి విదేశీయులు ఆసక్తి కనబరుస్తారు. ఒంటెల బండ్లపై ఊరేగుతూ సంత మొత్తం తిరుగుతూ పర్యాటకులు కూడా సందడి చేస్తారు.

ప్రారంభ రోజుల్లో అక్కడికి చేరుకుంటే.. అక్కడకు భారీగా తరలి వచ్చే ఒంటెల గుంపులు, పండుగకు చేసే ప్రత్యేక ఏర్పాట్లను తిలకించవచ్చు. కనుచూపు మేరలో ఎటుచూసినా బారులు తీరి నిలబడే ఒంటెలు చూపరులను ఆకర్షిస్తాయి. సందర్శకుల కోసం తాత్కాలిక గుడారాలతో ఒక ప్రత్యేక నగరాన్ని నిర్మిస్తారు. ఒంటెల యజమానులు, వారి కుటుంబాలు, పండుగను చూడటానికి వచ్చిన వారు ఈ గుడారాల్లో బస చేస్తారు.

ప్రజల విశ్వాసం..
బ్రహ్మదేవుడు పుష్కర్ వద్దనే ఒక కమలం జార విడిచారని, దాని చుట్టూ పెద్ద సరస్సు ఏర్పడిందని.. ఆ సరస్సు చుట్టూ నగర నిర్మాణం జరిగిందని భక్తుల నమ్మకం. బ్రహ్మ దేవుడికి గుడి ఉన్న ఏకైక ప్రాంతం పుష్కర్ మాత్రమే.



సాంస్కృతిక కార్యక్రమాలు..
ఇక్కడ ఒక వేదికను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ వేదికపైన వారం పొడవునా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుష్కర్ సరస్సుకు దారి తీసే రోడ్ల పొడవునా వివిధ షాపులు, స్టాళ్లు వెలిసి ఈ పండుగను సొమ్ము చేసుకుంటాయి. విలువైన కశ్మీరీ దుస్తుల నుంచి ఒంటెల అలంకారాలకు లభించే వస్తువుల వరకు అన్నీ ఇక్కడ లభ్యమవుతాయి.

ఒకవైపు 50,000కు పైగా గుంపులుగా బారులు తీరే ఒంటెలు, మరోవైపు 3 లక్షల వరకు ఈ వే డుకలు తిలకించేందుకు విచ్చేసిన జనాన్ని కలిపి కెమేరాలతో బంధించడానికి ఔత్సాహికులు పోటీపడుతుంటారు. ఒంటెలతో పాటు పుష్కర్‌లో గుర్రాలు, ఆవులు, ఎద్దులు.. మొదలైన పశువుల అమ్మకం, కొనుగోళ్లు జరుగుతాయి. అయితే వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వేడుకల్లో ప్రధాన ఆకర్షణ మాత్రం ఒంటెలే.

ప్రత్యేక షాపింగ్..
ఒంటెలకు అలంకరించడానికి రకరకాల అలంకార సామగ్రి తయారు చేసి ఇక్కడ అమ్ముతారు. అల్లిక వస్త్రాల నుంచి వెండి అలంకారాల వరకు ఇందులో ఉంటాయి. వెండి గంటలు, గొలుసులు, కడియాలు, గజ్జెలు లాంటివి ఇక్కడ లభ్యమవుతాయి. ఒంటెలను అలంకరించాక వాటికి అందాల పోటీలను కూడా నిర్వహిస్తారు.

ఇంకా ఇతర రకాల పోటీలను కూడా ఒంటెలకు ఏర్పాటు చేస్తారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ఒంటె మూపురంపై కూర్చుంటే అవి నిర్ధిష్ట దూరం వరకూ ప్రయాణం చేయడం ఒకపోటీ. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎక్కువ మందిని కూర్చోపెట్టుకున్న ఒంటె పోటీల్లో గెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement