ajmir
-
చదువులతల్లి పట్ల దారుణం: చైల్డ్ లైన్ ఫిర్యాదుతో వెలుగులోకి!
అత్యాచార బాధితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారానికి గురైన బాలికను 12వ తరగతి పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఒకప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు చైల్డ్ హెల్ప్లైన్నంబర్కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 12 బోర్డు పరీక్షలకు తనను హాజరుకానివ్వలేదంటూ అజ్మీర్‌లోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఆరోపించింది. గత ఏడాది సామూహిక అత్యాచారానికి గురయ్యావు కాబట్టి, పరీక్షకు హాజరైతే వాతావరణం చెడిపోతుందని పాఠశాల అధికారులు చెప్పారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. అడ్మిట్ కార్డ్ ఇవ్వ లేదని బాధితురాలు తెలిపింది. అడ్మిట్ కార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు, అధికారులు ఇకపై పాఠశాల విద్యార్థిని కాదని తెలిపారు. అయితే దీనిపై మరో టీచర్‌ను సంప్రదించగా, ఆమె చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయమని సూచించింది. అయితే బాధిత విద్యార్థిని గత నాలుగు నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో ఆమెను పరీక్షకు అనుమతించడం లేదని పాఠశాల అధికారులు వాదించారు. అయితే ఆమె స్కూలుకు హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను లోపలికి రానీయకుండా నిషేధించారని ఇంటి నుండే చదువుకోవాలని సూచించిందని అందుకే ఇంట్లో ఉండే పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు అంజలీ శర్మతో వాపోయింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అజ్మీర్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కేసు నమోదు చేసింది, విచారణ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజలి శర్మ వెల్లడించారు. శిశు సంక్షేమ శాఖ కూడా కేసు నమోదు చేసింది. 10వ తరగతి పరీక్షలలో 97 శాతం స్కోర్ సాధించిన బాధితురాలు ఇపుడు కూడామంచి మార్కులు తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కానీ పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఏడాది సమయం వృథా అవుతుందేమోనని భయపడుతోంది. కాగా గతేడాది అక్టోబర్‌లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.దీనిపై విచారణ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికా విద్య, మహిళల భద్రత గురించి ఎంత మాట్లాడు తున్నా, ఎంత ప్రచారం కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదనీ, మరీ ముఖ్యంగా విద్య నేర్పే పాఠశాల్లో ఇలాంటి దారుణం ఏమిటి అనే విమర్శలకు తావిస్తోంది. -
8న కర్నూలులో జాతీయ స్థాయి సున్ని ఇస్తెమా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మర్కజీ మిలాద్ కమిటీ, అహ్లె సున్నతుల్ జమాత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన జాతీయ స్థాయి ఒక్కరోజు సున్ని ఇస్తెమా నిర్వహించనున్నట్లు అహ్లెసున్నతుల్ జమాత్ జిల్లా కార్యదర్శి సయ్యద్‌షా షఫిపాషా ఖాద్రి తెలిపారు. మంగళవారం పాతబస్తీలోని హజరత్ లతీఫ్ లావుబాలి దర్గా ఆవరణలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్మీర్ దర్గా సజ్జాదే నషీన్‌తో పాటు జాతీయ స్థాయి మౌల్వీలు వక్తలుగా హాజరవుతారని తెలిపారు. ఇస్తెమా ఉస్మానియా కళాశాల మైదానంలో ఉంటుందని, తెల్లవారు జామున ఫజర్ నమాజు మొదలుకుని రాత్రి ఇషా నమాజు వరకు కొనసాగుతుందన్నారు. మూడు పూటలా భోజన సదుపాయంతో పాటు ఐదు పూటలా నమాజులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముస్లింలు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో అహ్లె సున్నతుల్ జమాత్ ప్రతినిధులు సయ్యద్ ఆబిద్ హుసేని, సయ్యద్ ముర్తుజా ఖాద్రి, సయ్యద్ మాసుంపీర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒంటెలకూ ఓ పండుగ..
సాక్షి: ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను బట్టి పలు రకాల పండుగలు ప్రాచుర్యంలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలైన.. తెలంగాణలో బతుకమ్మ, ఆంధ్రాలో సంక్రాంతి పండుగలు ఆ కోవలోనివే. దీనికి కొంచెం భిన్నంగా రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో ప్రతి ఏటా ఒంటెల పండుగ జరుపుకుంటారు. దీన్నే ‘పశువుల సంత’ అని కూడా పిలుస్తారు. ఆ విశేషాలేమిటో మనమూ తెలుసుకుందామా..! ప్రపంచంలోనే పెద్ద వేడుక.. రాజస్తాన్‌లో ఐదు రోజుల పాటు జరిగే ఒంటెల పండుగ ప్రపంచంలోని అతి పెద్ద ఒంటెల పండుగ, అతి పెద్ద పశువుల పండుగగా ప్రసిద్ధి చెందింది. కార్తీక మాసం(అక్టోబర్ - నవంబర్)లో పుష్కర్ సరస్సు ఒడ్డున జరిగే ఈ పండుగలో దాదాపు 2 లక్షల మందికి పైగా పాల్గొంటారని అంచనా. సుమారు 50,000కు పైగా ఒంటెలు ఈ వేడుకలో కనువిందు చేస్తాయి. పౌర్ణమి సమీపించే కొద్దీ పుష్కర్‌ను సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతుంది. పౌర్ణమి రోజు పుష్కర్‌లో స్నానమాచరిస్తే మంచిదని భక్తుల నమ్మకం. విదేశీ పర్యాటకుల సందడి.. పుష్కర్‌లో ఒంటెల సందడిని చూడడానికి దేశ, విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. సంప్రదాయక దుస్తులు ధరించి స్థానికులు చేసే హడావిడిని వీక్షించడానికి విదేశీయులు ఆసక్తి కనబరుస్తారు. ఒంటెల బండ్లపై ఊరేగుతూ సంత మొత్తం తిరుగుతూ పర్యాటకులు కూడా సందడి చేస్తారు. ప్రారంభ రోజుల్లో అక్కడికి చేరుకుంటే.. అక్కడకు భారీగా తరలి వచ్చే ఒంటెల గుంపులు, పండుగకు చేసే ప్రత్యేక ఏర్పాట్లను తిలకించవచ్చు. కనుచూపు మేరలో ఎటుచూసినా బారులు తీరి నిలబడే ఒంటెలు చూపరులను ఆకర్షిస్తాయి. సందర్శకుల కోసం తాత్కాలిక గుడారాలతో ఒక ప్రత్యేక నగరాన్ని నిర్మిస్తారు. ఒంటెల యజమానులు, వారి కుటుంబాలు, పండుగను చూడటానికి వచ్చిన వారు ఈ గుడారాల్లో బస చేస్తారు. ప్రజల విశ్వాసం.. బ్రహ్మదేవుడు పుష్కర్ వద్దనే ఒక కమలం జార విడిచారని, దాని చుట్టూ పెద్ద సరస్సు ఏర్పడిందని.. ఆ సరస్సు చుట్టూ నగర నిర్మాణం జరిగిందని భక్తుల నమ్మకం. బ్రహ్మ దేవుడికి గుడి ఉన్న ఏకైక ప్రాంతం పుష్కర్ మాత్రమే. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇక్కడ ఒక వేదికను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ వేదికపైన వారం పొడవునా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుష్కర్ సరస్సుకు దారి తీసే రోడ్ల పొడవునా వివిధ షాపులు, స్టాళ్లు వెలిసి ఈ పండుగను సొమ్ము చేసుకుంటాయి. విలువైన కశ్మీరీ దుస్తుల నుంచి ఒంటెల అలంకారాలకు లభించే వస్తువుల వరకు అన్నీ ఇక్కడ లభ్యమవుతాయి. ఒకవైపు 50,000కు పైగా గుంపులుగా బారులు తీరే ఒంటెలు, మరోవైపు 3 లక్షల వరకు ఈ వే డుకలు తిలకించేందుకు విచ్చేసిన జనాన్ని కలిపి కెమేరాలతో బంధించడానికి ఔత్సాహికులు పోటీపడుతుంటారు. ఒంటెలతో పాటు పుష్కర్‌లో గుర్రాలు, ఆవులు, ఎద్దులు.. మొదలైన పశువుల అమ్మకం, కొనుగోళ్లు జరుగుతాయి. అయితే వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వేడుకల్లో ప్రధాన ఆకర్షణ మాత్రం ఒంటెలే. ప్రత్యేక షాపింగ్.. ఒంటెలకు అలంకరించడానికి రకరకాల అలంకార సామగ్రి తయారు చేసి ఇక్కడ అమ్ముతారు. అల్లిక వస్త్రాల నుంచి వెండి అలంకారాల వరకు ఇందులో ఉంటాయి. వెండి గంటలు, గొలుసులు, కడియాలు, గజ్జెలు లాంటివి ఇక్కడ లభ్యమవుతాయి. ఒంటెలను అలంకరించాక వాటికి అందాల పోటీలను కూడా నిర్వహిస్తారు. ఇంకా ఇతర రకాల పోటీలను కూడా ఒంటెలకు ఏర్పాటు చేస్తారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ఒంటె మూపురంపై కూర్చుంటే అవి నిర్ధిష్ట దూరం వరకూ ప్రయాణం చేయడం ఒకపోటీ. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎక్కువ మందిని కూర్చోపెట్టుకున్న ఒంటె పోటీల్లో గెలుస్తుంది. -
అజ్మీర్ ఉర్సుకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : అజ్మీర్‌లో జరుగనున్న ఉర్సు ఉత్సవాలకు వెళ్లే ప్రయాణికుల కోసం నాంపల్లి,కాచిగూడ, ఒంగోలు, మచిలీపట్నంల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్-అజ్మీర్ ఉర్సు (07125/07126) స్పెషల్ ట్రైన్ మే 2వ తేదీన రాత్రి 8.10 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరుతుంది. ఇది సికింద్రాబాద్‌కు 8.30 కు చేరుకొని 8.35 గంటలకు అక్కడ నుంచి వెళుతుంది. మే4వ తేదీ ఉదయం 10.15 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 8వ తేదీన ఉదయం 7 గంటలకు అజ్మీర్ నుంచి బయలుదేరి 9వ తేదీ రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌కు,రాత్రి 11.45 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. - కాచిగూడ-అజ్మీర్ (07129/07130) స్పెషల్ ట్రైన్ మే 3వ తేదీ రాత్రి 10.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి 5వ తేదీ ఉదయం 4.50 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 7వ తేదీ సాయంత్రం 7.25 గంటలకు అజ్మీర్ నుంచి బయలుదేరి 9వ తేదీ ఉదయం 7 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. రాష్ట్రంలోని మల్కాజిగిరి, మేడ్చెల్, కామారెడ్డి,నిజామాబాద్, బాసరలలో ఈ రైళ్లు ఆగుతాయి. - ఒంగోలు-అజ్మీర్ (07227/07228) స్పెషల్ ట్రైన్ మే 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది. 12.25 గంటలకు విజయవాడ చేరుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుంది.మే 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 8వ తేదీ సాయంత్రం 7.25 గంటలకు అజ్మీర్ నుంచి బయలుదేరి 10వ తేదీ తెల్లవారు జామున 2.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. 2.50 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి ఉదయం 7 గంటలకు ఒంగోలు చేరుకుంటుంది. రాష్ట్రంలోని చీరాల,బాపట్ల,నిడుబ్రోలు,తెనాలి,న్యూగుంటూరు,విజయవాడ,మధిర,ఖమ్మం,మహబూబ్‌బాద్,వరంగల్, మంచిర్యాల,బెల్లంపల్లి,సిరిపూర్కాగజ్నగర్లలో ఆగుతుంది. - మచిలీపట్నం-అజ్మీర్ (07131/07132) ప్రత్యేక రైలు మే 4వ తేదీ ఉదయం 9 గంటలకు మచిలీపట్నం నుంచి బయల్దేరి 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇది ఒంగోలు-అజ్మీర్ ట్రైన్‌కు లింక్ అవుతుంది. ఇది ఒంటిగంటకు విజయవాడ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 10వ తేదీ తెల్లవారు జామున 3.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి (అప్పటి వరకు ఇది అజ్మీర్-ఒంగోలు ట్రైన్‌కు లింక్ అయి ఉంటుంది.) ఉదయం 6 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. చిలకలపూడి,పెడన స్టేషన్లలో కూడా ఆగుతుంది.