
చిన్నారులపై గ్యాంగ్ రేప్.. పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: ఇద్దరు చిన్నారులపై సామూహిక లైంగిక దాడి ఘటనలతో దేశ రాజధాని నిద్ర లేచింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులపై సామూహిక అత్యాచారాలు జరిగాయి. తీవ్ర గాయాలతో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రులలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం పలువురిని ఆవేదనకు గురిచేసింది.
మొదటి ఉదంతం పశ్చిమఢిల్లీలో చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నర ఏళ్ల పాపను అపహరించి, గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె ఇంటి సమీపంలోని పార్కు దగ్గర తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ చిన్నారిని ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాపపై అమానుషంగా అత్యాచారం చేశారని వైద్యులు తెలిపారు. చిన్నారికి శస్త్రచికిత్స చేశామని, పాప పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
మరో దారుణం తూర్పు ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో జరిగింది. ఐదేళ్ల పాపపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పాపను, పొరుగున ఉండే వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో నిందితుడి ఇంటినుంచి ఏడుస్తూ వస్తుండగా పొరుగువారు గుర్తించి సోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ ఈ ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నారులను పరామర్శించేందకు సంజయ్ గాంధీ ఆసుపత్రికి వెళుతున్నానంటూ ట్వీట్ చేశారు.