
హెల్మెట్ లేదని.. కారు డ్రైవర్ కు జరిమానా!!
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ద్విచక్ర వాహనాల వాళ్లు హెల్మెట్లు పెట్టుకోకపోతే వాళ్లకు జరిమానా విధించడం చూస్తున్నాం. వాళ్ల ప్రాణాలను కాపాడాలన్న సదుద్దేశంతోనే ఈ నిబంధన విధించారు. అయితే.. గోవాలో మాత్రం ట్రాఫిక్ పోలీసులకు ఉన్నట్టుండి ఏం బుద్ధి పుట్టిందో గానీ... హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటూ ఓ కారు డ్రైవర్ కు జరిమానా విధించారు. ఏక్నాథ్ అనంత్ పాల్కర్ అనే వ్యక్తి హెల్మెట్ లేకుండా కోల్వా బీచ్ సమీపంలోని ఓ గ్రామంలో కారు నడుపుతుండగా.. ట్రాఫిక్ ఎస్ఐ ఎస్ఎల్ హనుషికట్టి అతడిని పట్టుకుని చలానా రాశారు. మోటారు వాహన చట్టంలోని 177 సెక్షన్ కింద అతడిని బుక్ చేశారు.
ఆ సెక్షన్ ప్రకారం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానా విధించొచ్చు. అయితే... ఆ ఎస్ఐ ఏదో పొరపాటున ఆ సెక్షన్ రాసి ఉంటారని, సదరు కారు డ్రైవర్ ఏదో వేరే పొరపాటు చేసి ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం తగిన లైసెన్సు లేకపోవడం కూడా తప్పు. పొరపాటున ఆ ఎస్ఐ హెల్మెట్ లేదని రాసి ఉంటారని చెప్పారు. కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోనందుకు జరిమానా విధించేంత మూర్ఖులు ఎవరూ పోలీసు శాఖలో ఉండరని కూడా సదరు సీనియర్ అధికారి వ్యాఖ్యానించడం కొసమెరుపు.