శుక్లాల వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు
గడ్కారీ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో మద్యం కంటే కంటి శుక్లాల కారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ డ్రైవర్లలో 45 శాతం మందికి కంటి శుక్లాలు ఉన్నాయని అయితే వారు తమకు చూపు బాగున్నట్లు ప్రభుత్వాస్పత్రుల నుంచి నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్నారని అన్నారు. గడ్కారీ సోమవారమిక్కడ రోడ్డు భద్రత సదస్సులో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలకు సరైన రోడ్డు, ట్రాఫిక్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం, ప్రణాళికలు లేకపోవడం కూడా కారణమన్నారు.
దేశంలో ఏటా 1.40 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, వీటి వల్ల సమాజానికి రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రమాదకర రోడ్లలో మనవి కూడా ఉన్నాయన్నారు. పట్టణప్రాంతాల్లో వాహనాల సంఖ్య ఇదివరకెన్నడూ లేనంతగా పెరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోతోందన్నారు. కాలం చెల్లిన 1988 నాటి మోటారు వాహనాల చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు నవంబర్ మూడోవారంలో మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణ బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.