Central Road Transport Minister
-
Nitin Gadkari: కస్టమర్ సర్విసులపై మరింతగా దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని వాహన సంస్థలకు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. నాణ్యతకు భరోసానిస్తూ, విక్రయానంతర సేవలను మెరుగుపర్చుకునే విధంగా కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వయం సమృద్ధి సాధించాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో ఆటోమోటివ్ డీలర్లు ప్రధాన పాత్ర పోషించగలరని ఆయన తెలిపారు. దేశ ఎకానమీలో కీలకంగా ఉంటున్న ఆటో రిటైల్ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతునిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. పర్యావరణహిత మొబిలిటీ సొల్యూషన్స్ విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేందుకు భారత్ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. -
Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
న్యూఢిల్లీ: మోటార్ వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురై క్షతగాత్రులుగా మారినవారికి నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ పథకాన్ని ఛత్తీస్‌గఢ్, అస్సాంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి–జన ఆరోగ్య యోజన(ఏబీపీఎం–జేఏవై) కింద క్షతగాత్రులు ప్రమాదం జరిగిన తేదీ నుంచి వారం రోజులపాటు నిర్దేశిత ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల విలువైన వైద్యం పొందవచ్చని చెప్పారు. నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఓ) భాగస్వామ్యంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. మోటార్ వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 164బీ కింద ఏర్పాటైన మోటార్ వాహనాల ప్రమాధ నిధి నుంచి ఈ పథకానికి అవసరమైన నిధులు సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
Nitin Gadkari: రోడ్డు బాగాలేకపోతే టోల్ వసూలు చేయొద్దు
న్యూఢిల్లీ: రహదారి సరిగ్గా లేకపోతే వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ రహదారుల నిర్వహణ సంస్థలను ఆదేశించారు. శాటిలైట్ ఆధారిత టోల్ రుసుముల వసూలుపై బుధవారం ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించలేనప్పుడు టోల్ చార్జి వసూలు చేయొద్దని అన్నారు. గుంతలు, బురదతో నిండిన రోడ్లపై కూడా టోల్ వసూలు చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కిలోమీటర్ల మేర రహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
మూడేళ్లలో 7 హైవేలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత మూడేళ్లలో ఏడు కొత్త జాతీయ రహదారులను ప్రకటించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2020 జూన్ 29న ఖమ్మం–దేవరపల్లి, గతేడాది జూన్ 6న కల్వకుర్తి–కొల్లాపూర్–కరివేన, ఈ ఏడాది మార్చి 23న మెదక్–ఎల్లారెడ్డి–రుద్రూర్, బోధన్–బాసర–బైంసా, ఈ ఏడాది ఏప్రిల్ 7న హైదరాబాద్ ఓఆర్ఆర్–వలిగొండ–తొర్రూర్–మహబూబాబాద్– ఇల్లెందు– కొత్తగూడెం, తాండూర్–కొడంగల్–మహబూబ్‌నగర్ రహదారి నిర్మాణ పనులు మంజూరైనట్లు బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు గడ్కరీ లిఖితపూర్వకంగా తెలిపారు. ►బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఏవియేషన్ వర్సిటీని ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనేదీ కేంద్ర పౌరవిమానయాన శాఖ వద్ద లేదని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్.జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంలో తెలిపారు. ►ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)లో భా గంగా తెలంగాణకు 2.24 లక్షల ఇళ్లు కేటాయి ంచగా, ఇప్పటివరకు 2.05 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్టు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ►సమగ్రశిక్ష అభియాన్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.290.42 కోట్లు కేంద్రం విడుదల చేసిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ►వందేభారత్ మిషన్ ద్వారా గత నెల 29 వరకు 100 దేశాల నుంచి 88,700 విమాన సర్వీసుల ద్వారా 72 లక్షల మంది ప్రయాణికులను విదేశాల నుంచి భారత్‌కు వచ్చారని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ వి.కె.సింగ్.. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ►తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో అనుమతుల్లేని వాటిని ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో పొందుపరిచామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ►దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్మశాలీలు, నీలకంఠం సామాజిక వర్గాలకు చెందిన నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు స్కిల్ సెంటర్లను ఏర్పాటుచేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ►గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 119 కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించగా, అందులో తెలంగాణలో 4 ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ►కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని అంగన్వాడి సేవలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.116.11 కోట్లు విడుదల చేశామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఇంకా చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ పథకం కింద రూ.1.57కోట్లు, బేటీ బచావో బేటీ పడావో పథకం అమలుకు రూ.2.19 కోట్లు తెలంగాణకు విడుదల చేశామన్నారు. -
శుక్లాల వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు
గడ్కారీ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో మద్యం కంటే కంటి శుక్లాల కారణంగానే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ డ్రైవర్లలో 45 శాతం మందికి కంటి శుక్లాలు ఉన్నాయని అయితే వారు తమకు చూపు బాగున్నట్లు ప్రభుత్వాస్పత్రుల నుంచి నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్నారని అన్నారు. గడ్కారీ సోమవారమిక్కడ రోడ్డు భద్రత సదస్సులో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలకు సరైన రోడ్డు, ట్రాఫిక్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం, ప్రణాళికలు లేకపోవడం కూడా కారణమన్నారు. దేశంలో ఏటా 1.40 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని, వీటి వల్ల సమాజానికి రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రమాదకర రోడ్లలో మనవి కూడా ఉన్నాయన్నారు. పట్టణప్రాంతాల్లో వాహనాల సంఖ్య ఇదివరకెన్నడూ లేనంతగా పెరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోతోందన్నారు. కాలం చెల్లిన 1988 నాటి మోటారు వాహనాల చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు నవంబర్ మూడోవారంలో మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణ బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.