సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత మూడేళ్లలో ఏడు కొత్త జాతీయ రహదారులను ప్రకటించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2020 జూన్ 29న ఖమ్మం–దేవరపల్లి, గతేడాది జూన్ 6న కల్వకుర్తి–కొల్లాపూర్–కరివేన, ఈ ఏడాది మార్చి 23న మెదక్–ఎల్లారెడ్డి–రుద్రూర్, బోధన్–బాసర–బైంసా, ఈ ఏడాది ఏప్రిల్ 7న హైదరాబాద్ ఓఆర్‌ఆర్–వలిగొండ–తొర్రూర్–మహబూబాబాద్– ఇల్లెందు– కొత్తగూడెం, తాండూర్–కొడంగల్–మహబూబ్‌నగర్ రహదారి నిర్మాణ పనులు మంజూరైనట్లు బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు గడ్కరీ లిఖితపూర్వకంగా తెలిపారు.
►బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఏవియేషన్ వర్సిటీని ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనేదీ కేంద్ర పౌరవిమానయాన శాఖ వద్ద లేదని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ ఎంపీ డాక్టర్.జి.రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంలో తెలిపారు.
►ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్)లో భా గంగా తెలంగాణకు 2.24 లక్షల ఇళ్లు కేటాయి ంచగా, ఇప్పటివరకు 2.05 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్టు టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
►సమగ్రశిక్ష అభియాన్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.290.42 కోట్లు కేంద్రం విడుదల చేసిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
►వందేభారత్ మిషన్ ద్వారా గత నెల 29 వరకు 100 దేశాల నుంచి 88,700 విమాన సర్వీసుల ద్వారా 72 లక్షల మంది ప్రయాణికులను విదేశాల నుంచి భారత్‌కు వచ్చారని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ వి.కె.సింగ్.. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
►తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో అనుమతుల్లేని వాటిని ఇటీవల జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పొందుపరిచామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
►దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్మశాలీలు, నీలకంఠం సామాజిక వర్గాలకు చెందిన నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు స్కిల్ సెంటర్లను ఏర్పాటుచేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు.
►గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 119 కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించగా, అందులో తెలంగాణలో 4 ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
►కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని అంగన్‌వాడి సేవలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.116.11 కోట్లు విడుదల చేశామని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఇంకా చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ పథకం కింద రూ.1.57కోట్లు, బేటీ బచావో బేటీ పడావో పథకం అమలుకు రూ.2.19 కోట్లు తెలంగాణకు విడుదల చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment