
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి గడ్కరీ ఆదేశం
న్యూఢిల్లీ: రహదారి సరిగ్గా లేకపోతే వాహనదారుల నుంచి టోల్ రుసుము వసూలు చేయొద్దని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ రహదారుల నిర్వహణ సంస్థలను ఆదేశించారు. శాటిలైట్ ఆధారిత టోల్ రుసుముల వసూలుపై బుధవారం ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.
రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించలేనప్పుడు టోల్ చార్జి వసూలు చేయొద్దని అన్నారు. గుంతలు, బురదతో నిండిన రోడ్లపై కూడా టోల్ వసూలు చేస్తే జనం నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కిలోమీటర్ల మేర రహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.