సీబీఐకి సవాల్ విసిరిన దయానిధి మారన్!
చెన్నై: అక్రమ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కేసులో సీబీఐ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మాజీ టెలికాం మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్ మండిపడ్డారు. సరైన సాక్ష్యాధారాలుంటే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తన మాజీ వ్యక్తిగత కార్యదర్శి సహా మరో ఇద్దర్ని బుధవారం పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కేసును బహిర్గతం చేసిన ఆర్‌ఎస్‌ఎస్ సిద్దాంతకర్త గురుమూర్తిని సంతప్తి పరచడానికి సీబీఐ అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో గురువారం డీఎంకే అధినేత ఎం. కరుణానిధిని కలిసిన మారన్ జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఏడాదిన్నరగా విచారణకు సహకరిస్తున్నా తన సన్నిహితులను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇప్పించేందుకు సీబీఐ వారిని చిత్రహింసలకు గురిచేస్తోంద న్నారు. దీనిపై సీబీఐ డెరైక్టర్‌తో పాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ రాయనున్నట్లు మారన్ తెలిపారు.
కాగా, తన నివాసానికి, అక్కడి నుంచి కుటుంబానికి చెందిన టీవీ ఛానెల్‌కు అక్రమంగా 300 హైస్పీడ్ టెలిఫోన్ లైన్స్ వేయించారన్న కేసులో మారన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన ప్రస్తావిస్తూ తన ఇంటికి ఒకే ఒక టెలీఫోన్ కనెక్షన్ ఉందని చెప్పారు. అదే ఇప్పటికీ కొనసాగుతున్నట్లు తెలిపారు. మారన్ సమక్షంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కుమారుడు, ఆ పార్టీ ట్రెజరర్ స్టాలిన్ మాట్లాడుతూ సీబీఐ రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నట్లు ఆరోపించారు.