సీబీఐ చీఫ్ వ్యాఖ్యలపై దుమారం
ఇషత్ర్ కేసులో అమిత్ షాను ఇరికిస్తే యూపీఏ సంతోషించేదని
రంజిత్ అన్నట్లు ఆంగ్లపత్రిక కథనం
ఖండించిన సీబీఐ
న్యూఢిల్లీ: ఇషత్ ్రజహాన్ ఎన్‌కౌంటర్ కేసు చార్జిషీటులో బీజేపీ నేత అమిత్ షా పేరును నిందితునిగా చేర్చినట్లయితే యూపీఏ ప్రభుత్వం సంతోషించేదని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా వ్యాఖ్యానించిట్టుగా ఢిల్లీకి చెందిన ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం వివాదానికి దారితీసింది. అయితే దీనిని సీబీఐ ప్రతినిధి ఖండించారు. సిన్హా అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అమిత్ షా సన్నిహితుడనే విషయం తెలిసిందే. ఇషత్ ్రఎన్‌కౌంటర్ వ్యవహారంలో మాజీ హోంమంత్రి అమిత్‌షా(ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో హోంమంత్రిగా ఉన్నారు)ను ప్రశ్నించినప్పటికీ ఆయన పేరును సీబీఐ చార్జిషీటులో పేర్కొనలేదు. అయితే ఆయన పేరును నిందితునిగా చేర్చినట్లయితే యూపీఏ ప్రభుత్వం సంతోషించేదని, కానీ తాము సాక్ష్యాధారాలకు అనుగుణంగా వ్యవహరించామని, అమిత్ షాను ప్రాసిక్యూట్ చేయతగిన సాక్ష్యాలేవీ లేవని కనుగొన్నట్టు సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా పేర్కొన్నట్టు ఢిల్లీకి చెందిన ఓ ఆంగ్ల బిజినెస్ దినపత్రిక తన కథనంలో పేర్కొంది. దీనిపై సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సీబీఐ డెరైక్టర్ అటువంటి వ్యాఖ్యలేమీ చేయలేదని, ఆయన వ్యాఖ్యలను తప్పుగా పేర్కొన్నారని స్పష్టం చేశారు. సీబీఐ నిష్పాక్షికమైన, రాజకీయాలతో సంబంధం లేని సంస్థ అని తెలిపారు.
ఇషత్ ్రజహాన్ కేసులో సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపిందని వివరించారు. ఇదిలా ఉండగా అమిత్ షాను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిని దెబ్బతీయడానికి సీబీఐపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించిందనేందుకు సీబీఐ డెరైక్టర్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని బీజేపీ ప్రతినిధి నిర్మలా సీతారామన్ విమర్శించారు. దీనిపై జనతాదళ్(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ స్పందిస్తూ.. రాజకీయపార్టీల గురించి ఇంతవరకు ఏ సీబీఐ డెరైక్టర్ కూడా ఇటువంటి ప్రకటనలు చేయలేదని మండిపడ్డారు. ఆయన తనకున్న అధికార పరిధుల మేరకు వ్యవహరించాలని హితవు పలికారు.