‘నన్ను ప్రశ్నించండి..మావాడి జోలికెళ్లద్దు’
సాక్షి,న్యూఢిల్లీః ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసుకు సంబంధించి సీబీఐ తన కుమారుడిని వేధించడం మాని తనను ప్రశ్నించాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు. దర్యాప్తు సంస్థ తమ కుమారుడి ప్రమేయంపై దుష్ర్పచారం చేస్తోందని ఆరోపించారు. 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఓ విదేశీ పెట్టుబడి ప్రతిపాదనకు క్లియరెన్స్ ఇవ్వడంపై గురువారం కార్తీ చిదంబరాన్ని విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ కోరిన విషయం విదితమే.
ఈ కేసులో నిందితులందరిపై ఆరోపణలను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చిందని చెబుతూ సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నిరాకరించారు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ వ్యవహారంలో ఎఫ్‌ఐపీబీ సిఫార్సు మేరకు మినిట్స్‌ను తాను ఆమోదించానని, సీబీఐకి ఏమైనా అనుమానాలుంటే తనను ప్రశ్నించాలని, కార్తీ చిదంబరంను వేధించరాదని అన్నారు. ఈ కేసులో సీబీఐ ఎదుట హాజరైన ఎఫ్‌ఐపీబీ అధికారులు అప్రూవల్ చెల్లుబాటు సరైనదేనని స్టేట్‌మెంట్లు ఇచ్చారని చిదంబరం ట్వీట్ చేశారు.