మళ్లీ తెరపైకి బోఫోర్స్‌ కేసు | CBI Wants To Reopen Bofors Case, Government To Decide | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి బోఫోర్స్‌ కేసు

Published Fri, Aug 11 2017 11:23 AM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM

మళ్లీ తెరపైకి బోఫోర్స్‌ కేసు

మళ్లీ తెరపైకి బోఫోర్స్‌ కేసు

న్యూఢిల్లీ : రాజకీయంగా పెను ప్రకంపనలు రేపిన బోఫోర్స్‌ కేసును తిరిగి విచారించనున్నట్టు సీబీఐ శుక్రవారం పార్లమెంటరీ కమిటీకి సంకేతాలు పంపింది. బోఫోర్స్‌ కేసు పునర్విచారణ చేపట్టాలని, సుప్రీంకోర్టు ముందు నివేదించాలని పలువురు పార్లమెంటరీ కమిటీ సభ్యులు కోరిన మీదట ఈ మేరకు సీబీఐ బదులిచ్చింది. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌కు మద్దతిస్తామని కూడా సీబీఐ పేర్కొంది.

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే...1986 మార్చి 24న భారత సైన్యం కోసం 400 అత్యాధునిక తుపాకుల సరఫరా నిమిత్తం స్వీడిష్‌ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్‌, భారత ప్రభుత్వం మధ్య రూ.1437 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందుకోసం ఏబీ బోఫోర్స్‌.. భారత్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించినట్టు 1987 ఏప్రిల్‌ 16న స్వీడిష్‌ రేడియో ప్రకటించడంతో దుమారం రేగింది. దీంతో 1990లో సీబీఐ అప్పటి బోఫోర్స్‌ ప్రెసిడెంట్‌ మార్టిన్‌, దళారీ విన్‌ చద్దా, హిందుజా సోదరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

కేసు విచారణ క్రమంలో పలువురు నిందితులు ఖత్రోచి, విన్‌ చద్దా, భట్నాగర్‌, మార్టిన్‌లు మరణించారు. ఇక 2005 మే 31న బోఫోర్స్‌ కేసులో హిందుజా సోదరులు శ్రీచంద్‌, గోపీచంద్‌, ప్రకాష్‌ చంద్‌లపై అన్ని అభియోగాలను ఢిల్లీ హైకోర్టు జడ్జి ఆర్‌ఎస్‌ సోధి కొట్టివేశారు. 2004 ఫిబ్రవరి 4న ఢిల్లీ హైకోర్టు మరో జడ్జి బోఫోర్స్‌ కేసులో దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చారు. బోఫోర్స్‌ కంపెనీపై కుట్రపూరిత మోసం అభియోగాలను మోపాలని ఆదేశించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement