న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 10, 12 తరగతులకు జరుగుతున్న బోర్డు పరీక్షలను సీబీఎస్‌ఈ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) మార్చి 31 వరకు వాయిదావేసింది. ‘భారత్‌లో, విదేశాల్లో జరుగుతున్న క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలను మార్చి 31 వరకు వాయిదా వేస్తున్నాం. ఆ పరీక్షలను తదుపరి ఎప్పుడు నిర్వహించేదీ.. పరిస్థితులను సమీక్షించి, త్వరలో ప్రకటిస్తాం’ అని సీబీఎస్‌ఈ బుధవారం వెల్లడించింది. పరీక్ష పత్రాల మూల్యాంకన విధులను కూడా మార్చి 31 వరకు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, తమ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేయలేదని ఐసీఎస్సీ(ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ప్రకటించింది. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఐఐటీ ఇతర ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ(జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఏప్రిల్ 5 నుంచి 11 వరకు జరగాల్సి ఉండగా, వాయిదా వేసినట్లు హెచ్చార్డీ శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత ముఖ్యమని, అందువల్ల అన్ని పరీక్షలను వాయిదా వేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ సీబీఎస్సీ, ఇతర విద్యాసంస్థలను ఆదేశించిన నేపథ్యంలో సీబీఎస్సీ పై నిర్ణయం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment