జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్‌పీ వైద్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, శ్రీనగర్ : రంజాన్ సందర్భంగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాలను నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సానుకూల ఫలితాలు ఇస్తుందని రాష్ట్ర డీజీపీ ఎస్‌పీ వైద్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ప్రకటించిన కాల్పుల విరమణ నిర్ణయం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న శక్తులు సహా అన్ని వర్గాలపై సానుకూల ప్రభావం చూపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఏడాది జూన్‌లో ప్రారంభంకానున్న అమర్‌నాథ్ యాత్ర శాంతియుతంగా ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు నెలలపాటు సాగే అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పెచ్చుమీరుతుందన్న ఆందోళనలను తోసిపుచ్చారు. యాత్ర ఆసాంతం సజావుగా సాగుతుందని భావిస్తున్నామన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా కేంద్రం తీసుకున్న చొరవతో అమర్‌నాథ్ యాత్ర సైతం ప్రశాంతంగా ముగుస్తుందని అన్నారు. రంజాన్ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా హింసను విడనాడి కాల్పుల విరమణను పాటించాలని కోరారు. కాల్పుల విరమణను లష్కరే తోయిబా తోసిపుచ్చడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ లష్కరే నిర్ణయం ఎలాగున్నా తాము సరైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రంజాన్ నెలలో భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్‌లో ఎలాంటి ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టవని మే 16న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment