మళ్లీ అదే దుశ్చర్య
సరిహద్దులో ఆగని పాక్ కాల్పులు
12 మందికి గాయాలు
రక్షణ మంత్రితో త్రివిధ దళాధిపతుల భేటీ
జమ్మూ/న్యూఢిల్లీ: సరిహద్దులో పాకిస్థాన్ బలగాల ఆగడాలు మితిమీరాయి. సోమవారం అర్నియా పట్టణంలో ఐదుగురు భార త పౌరులను బలిగొన్న పాక్ దళాలు మంగళవారం కూడా పలుసార్లు భారీస్థాయిలో కాల్పులకు తెగబడ్డాయి. జమ్మూ, పూంచ్, రాజౌరీ, కతువా జిల్లాల్లో వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 40 భారత సరిహద్దు సైనిక శిబిరాలు, 25 గ్రామాలపై భారీ కాల్పులు, మోర్టారు బాంబు దాడులకు తెగబడ్డాయి. ఒక భారత జూనియర్ ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు సహా 12 మంది గాయపడ్డారు. అర్నియా పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన బాంబు దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. పాక్ కాల్పులను భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం రాత్రి దాటాక కూడా ఇరు పక్షాల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ చర్యతో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించడానికి ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల డెరైక్టరేట్ జనరల్ అధికారులు హాట్‌లైన్‌లో మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది. కాల్పులు విరమణను మీరే ఉల్లంఘించారంటూ పరస్పరం ఆరోపించుకున్నారు. మరోపక్క.. భారత త్రివిధ దళాల అధిపతులు మంగళవారం ఢిల్లీలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై సరిహద్దు పరిస్థితిపై చర్చించారు. పాక్ కాల్పుల నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరపాలన్న ప్రతిపాదనను భారత్ చివరి నిమిషంలో పక్కన పెట్టింది. సోమవారం నాటి పాక్ కాల్పుల్లో గాయపడిన ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు తెలుస్తోంది. కాల్పుల భయంతో సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.